
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ““కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ”అనే అంశంపై జరిపిన 80వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీ వేత్తలలో కొంతమంది ఈ రోజు ఒకే వేదికమీద పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంటూ, శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అసంఖ్యాకంగాఉన్న భారతీయ భాషలలో, 24 భాషలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్యఅకాడమీ ప్రదానంచేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న 8 మంది తెలుగు సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, వారు పురస్కారం పొందిన రచనలపై స్వీయవిశ్లేషణ చెయ్యడం చాలా వినూత్నంగా ఉందన్నారు. ఇప్పటివరకు కేవలం భారతీయ పౌరసత్వం కల్గినవారు మాత్రమే ఈ పురస్కారాలు అందుకోవడానికి అర్హులు. కాని పద్మ పురస్కారాల లాగా, భారతీయ పౌరసత్వంతో సంభందం లేకుండా, వివిధ దేశాలలో స్థిరపడిన భారతీయమూలాలున్న రచయితలను కూడా ఈ కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కారాలకు అర్హులను చేస్తే, మరిన్ని వైవిధ్య భరితమైన రచనలు పోటీలకు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ విషయాన్ని పరిశీలించాలని లక్షలాదిమంది ప్రవాసభారతీయుల తరపున కేంద్ర సాహిత్య అకాడమీకి డా. ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.
గత 12 సంవత్సరాలగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్న డా. కృతివెంటి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ “కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార పోటీలకు వచ్చే తెలుగు రచనలు ఇతర భాషలతో పోల్చిచూస్తే వాసి లోను, రాశిలోనూ సంతృప్తికరమైన స్థాయిలోనే ఉన్నాయన్నారు. అయితే మన తెలుగు రచనలు ఎక్కువగా ఆంగ్లం, హిందీ తదితర బాషలలోకి ఎక్కువగా అనువాదం కావలసిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరంనుండి రచయితలు ఎవ్వరికివారే ఈ పోటీలకు స్వయంగా తమ రచనలను పంపుకోవచ్చు అన్నారు.”
ఈ సాహిత్య కార్యక్రమంలో విశిష్ట అతిథులు గా పాల్గొన్న ...
డా. గోరటి వెంకన్న, “వల్లంకి తాళం” కవిత, 2021-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. మధురాంతకం నరేంద్ర, “మనోధర్మ పరాగం” నవల, 2022-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. తల్లావజ్జల పతంజలి శాస్త్రి, “రామేశ్వరం కాకులు, మరికొన్ని కథలు”, 2023-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత; డా. ఎలనాగ (నాగరాజు సురేంద్ర), Galib-The Man, The Times, in English by Mr. Pavan Varma; “గాలిబ్ నాటి కాలం” తెలుగు అనువాదం-2023-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారగ్రహీత; పెనుగొండ
లక్ష్మీనారాయణ, “దీపిక” రచనకు-2024-కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత, పమిడిముక్కల చంద్రశేఖర ఆజాద్, “మాయా లోకం” నవల, 2024-కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారగ్రహీత, డా. తుర్లపాటి రాజేశ్వరి, ఒడియా నవల “దాడీ బుధా” ను “ఈతచెట్టు దేవుడు” గా తెలుగులోకి అనువాదం- 2024-కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారవిజేతలు తమ పురస్కార రచనల విశేషాలను ఆసక్తిగా పంచుకున్నారు.