
దోహా: కొద్ది రోజులుగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు ఫలించాయి. పాక్-ఆప్ఘన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు దేశాల సరిహద్దులో దాడులు నిలిచిపోనున్నాయి.
ఖతార్ రాజధాని దోహా వేదికగా పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే (Turkey) మధ్యవర్తిత్వం వహించాయి. చర్చల్లో పాల్గొనేందుకు ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఖతార్ వచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించి కీలకంగా చర్చించారు. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో, శాంతి చర్చలు ఫలించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది.
ఇక, శుక్రవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలకు మాత్రమే ప్రతిస్పందిస్తున్నామన్నట్లుగా ఇరువర్గాలు వాదనలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆప్ఘన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాక్ పేర్కొంది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆప్ఘన్ ఖండించింది.