
కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మలయాళీలు ఘనంగా జరుపుకునే పర్వదినాలలో ఇది ఒకటి. వితరణ శీలి, ప్రజానురంజక పాలకుడైన బలిచక్రవర్తి ఈరోజు భూమి మీదకు తిరిగి వస్తాడని మలయాళీలు నమ్ముతారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలల్లో వస్తుంది. ఇది 12 రోజులపాటు జరుపుకునే పండుగ.
ఇది ఎంతో చరిత్ర, సంంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఈ సంవత్సరం ఓనం పండుగను సెప్టెంబరు 5, శుక్రవారం జరుపుకోనున్నారు. తిరువోణం అని పిలువబడే రోజునే బలి వస్తాడంటారు. ఆ రోజే ప్రధానవేడుకను చేసుకుంటారు.
కేరళ సంస్కృతికి అద్దం పట్టే పండుగ ఓనం. బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకుని మలయాళీలు ఈరోజున తమ ఇళ్లను పువ్వులు, తోరణాలు, రంగోలీలతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఖీర్, పులిస్సేరి వంటి రుచికరమైన వంటకాలను కూడా తయారు చేస్తారు. ప్రతి కుటుంబం ఓనం సద్యను తయారు చేస్తాయి. ఈ శాకాహార భోజనంలో 20కిపైగా వంటకాలు ఉంటాయి.
ఈ పండుగను పురస్కరించుకుని కథాకళి నృత్యం, వల్లం కలి(బోట్ రేస్) వంటివి ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు కైకొట్టికలి, తుంబి తుల్లాల్ సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. ఈరోజున మగవారు చొక్కా, ముండు అని పిలువబడే లుంగీ ధరిస్తారు. స్త్రీలు ముండు, నరియతు అనబడే ఒక బంగారు పై ఆచ్చాదనను ధరిస్తారు. ఓనం కేరళలో వ్యవసాయ పండుగ. కుమ్మట్టికలి, పులికలి వంటి జానపద ప్రదర్శనలు కూడా ఇస్తారు.పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య) వంటి ఆటల్లో పాల్గొంటారు.
ఓనం పండుగ ముఖ్య తేదీలు
సెప్టెంబర్ 4, 2025 – ఉత్రాదం రోజు, మొదటి ఓనం (ఉత్రడప్పచ్చిల్)
సెప్టెంబర్ 5, 2025 – తిరువోణం రోజు, రెండవ ఓణం (ప్రధాన వేడుక)
సెప్టెంబర్ 6, 2025 – అవిట్టం రోజు, మూడవ ఓనం, త్రిస్సూర్ పులికలి
సెప్టెంబర్ 7, 2025 – చాతాయం రోజు, నాల్గవ ఓనం
(చదవండి: గణేశ నిమజ్జనం ఆంతర్యం..!)