
ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ విజయమ్మ తదితరులు
ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధిపై పూలమాల వేసి
నివాళులర్పించిన వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ విజయమ్మ
మహానేతను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు
16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న అభిమానులు
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని ఘాట్ వద్ద ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కోడలు వైఎస్ భారతీరెడ్డి, సోదరుడు వైఎస్ సు«దీకర్‌రెడ్డి, దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సమీప బంధువు వైఎస్ యువరాజ్‌రెడ్డిలతోపాటు పలువురు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి స్మరించుకున్నారు.
ప్రత్యేక ప్రార్థనలు..
వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకుని ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పాస్టర్లు బెన్‌హర్ నరేష్ బాబు, మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. వైఎస్సార్ కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున సమాధి ప్రాంగణానికి చేరుకుని నివాళులర్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో వైఎస్సార్ ఘాట్ ప్రాంగణం నిండిపోయింది.
అందరినీ పలుకరిస్తూ..
వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం తండ్రిని స్మరించుకుంటూ వైఎస్ జగన్ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు. సమాధి ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులను పలకరిస్తూ ముందుకు కదిలారు. ఆయన వెంట మాజీ డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథరెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, విరూపాక్షి, పలువురు ఎమ్మెల్సీలు తదితరులున్నారు.
నినాదాలతో హోరెత్తిన ఘాట్
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పోటెత్తిన అభిమానులు, కార్యకర్తల నినాదాలతో ఇడుపులపాయ హోరెత్తింది. ఉదయం ఘాట్ ప్రాంతానికి వైఎస్ జగన్ చేరుకోగానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ నినదించారు.

తల్లి విజయమ్మతో వైఎస్ జగన్
నాన్నా... నిన్ను
చాలా మిస్ అవుతున్నాను వైఎస్సార్‌కు నివాళులర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఘన నివాళులర్పించారు. ‘నాన్నా... నిన్ను చాలా మిస్ అవుతున్నాను’ అంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వైఎస్సార్‌తో తాను కలిసి ఉన్న ఫొటోలు, వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పిస్తున్న ఫొటోలను పోస్టుకు ట్యాగ్ చేశారు.