
రైతుల సమస్యలపై ప్రత్యక్ష పోరాటం
కడప కార్పొరేషన్: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, అంజద్‌బాషా, ఇతర ముఖ్య నాయకులతో కలిసి కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేదని, ఉల్లి, చీనీ, మినుము పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 9న రైతు సమస్యలపై నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, నిరసనలు చేయాలన్నారు. ఈ ర్యాలీలు, నిరసనల్లో రైతులు ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, నూర్‌బాష్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఓ. రసూల్, శ్రీరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోర్ కమిటీ సమావేశంలో వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి