
పుతిన్, కిమ్ సహా 26 దేశాధినేతల సమక్షంలో చైనా నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అద్భుతంగా ఉంది అంటూనే అది తన దృష్టిని ఆకర్షించేందుకు రూపొందించిన నాటకీయ ప్రదర్శన మాత్రమేనని సెటైర్ వేశారు. ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో ఈ విషయంపై స్పందిస్తూ..
‘‘నాకు తెలిసి అది అందమైన.. అత్యంత అద్భుతమైన కార్యక్రమం. కానీ, వాళ్లు అలా ఎందుకు చేశారో నేను అర్థం చేసుకోగలను. నేను చూస్తున్నాననే వాళ్లు అనుకుని ఉంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు. బుధవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో తియానన్‌మెన్ స్క్వేర్ వద్ద రెండో ప్రపంచ యుద్ధ విక్టరీ పరేడ్ జరిగింది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ సహా 26 దేశాల అధినేతలు హాజరయ్యారు. దాదాపు 50 వేల మందికి పైగా వీక్షకులు హాజరైన ఈ పరేడ్‌లో శక్తివంతమైన క్షిపణులనూ చైనా ప్రదర్శనకు ఉంచింది. అయితే..
తన ప్రసంగంలో జిన్‌పింగ్ అమెరికాను ప్రస్తావించకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ను ఓడించడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని చైనాకు గుర్తు చేశారాయన. షీ(జిన్‌పింగ్) స్నేహితుడే. కానీ, ఆయన అమెరికా పేరును ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చైనాకు స్వాతంత్రం దక్కడంలో మా సాయం కూడా ఉంది. అలాంటిది క్రెడిట్ కోరుకోవడం తప్పేం కాదు కదా అని ట్రంప్ అన్నారు.
అంతకు ముందు.. ఈ ముగ్గురు దేశాధినేతల కలయికపై ట్రంప్ Truth Socialలో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జాంగ్ ఉన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అమెరికా వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని అనిపిస్తోంది అంటూ పోస్ట్ చేశారాయన. అయితే.. అయితే, వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాత్రం స్వరాన్ని మార్చారాయన.
వాళ్లతో తన సంబంధం బాగానే ఉందని.. వచ్చే రెండు వారాల్లో అది ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అదే సమయంలో.. బీజింగ్ పరేడ్‌కు ఆహ్వానం రాకపోవడంపై ట్రంప్‌కు ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన.. ఆ విషయం గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు. నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని బదులిచ్చారు. అంతేకాదు.. త్వరలో షీ జిన్‌పింగ్‌ను కలిసే అవకాశం ఉందని బదులిచ్చారాయన.