సీఎం సిద్ధరామయ్యకు బిగ్‌ రిలీఫ్‌ | MUDA Case: Judicial Commission Clean Chit To CM Siddaramaiah Family | Sakshi
Sakshi News home page

సీఎం సిద్ధరామయ్యకు బిగ్‌ రిలీఫ్‌.. సంచలన కేసులో క్లీన్‌చిట్‌

Sep 5 2025 9:42 AM | Updated on Sep 5 2025 10:37 AM

MUDA Case: Judicial Commission Clean Chit To CM Siddaramaiah Family

బెంగళూరు: కర్ణాటకలోని మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులకు కమిషన్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ముడా కేసులో వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి, అసత్యమైనవే అని జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ నేతృత్వంలోని ఏకసభ్య విచారణ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు కమిషన్ నివేదిక సమర్పించింది.  దీంతో, సిద్దరామయ్యకు ఉపశమనం లభించింది.

వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ముడా భూముల వ్యవహారంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, కుటుంబ సభ్యులకు.. భూములు అక్రమంగా కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తం 14 స్థలాలు అక్రమంగా కేటాయించారని తీవ్ర విమర్శలు బయటకు వచ్చాయి. అయితే, విచారణలో ఈ ఆరోపణలకు ఏ మాత్రం ఆధారాలు లేవని, కనీసం చట్ట ఉల్లంఘన కూడా జరగలేదని పీ.ఎన్. దేశాయ్ కమిషన్ నివేదికలో పేర్కొంది. డీ-నోటిఫై అయిన భూములను ముడా తిరిగి వినియోగించుకున్నందుకు భూమి యజమానులకు పరిహారంగా స్థలాలు కేటాయించడమైందని, ఇది చట్ట ప్రకారమే జరిగిందని నివేదిక స్పష్టం చేసింది.

దీంతో, ముడా కేసులో సీఎం సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, నిరాధారమని విచారణ కమిషన్ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఇంతకుముందు ఈ కేసును పరిశీలించిన కర్ణాటక లోకాయుక్త కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపింది. సరైన ఆధారాలు లేకపోవడం వల్లనే క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఇక, తాజాగా ఈ విషయాన్ని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం విధాన సౌధలో మీడియాతో పాటిల్‌ మాట్లాడుతూ.. జస్టిస్ పీ.ఎన్. దేశాయ్ నేతృత్వంలోని కమిషన్ సమర్పించిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలిపిందని చెప్పారు.

ఇదిలా ఉండగా.. కొందరు ముడా అధికారుల పనితీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2020 నుంచి 2024 మధ్య పనిచేసిన కొంతమంది కమిషనర్లు నిబంధనలకు విరుద్ధంగా, తమకు ఇష్టమొచ్చినట్లు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించారని పేర్కొంది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో, ప్రభుత్వం చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement