
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఉత్పత్తుల విభాగంలో 50శాతం టారిఫ్‌ను విధించారు. ఇప్పుడు అదే బాటలో సేవల విభాగంపై టారిఫ్‌లు విధించేందుకు సిద్ధమైంది.
వాణిజ్య పరంగా భారత్‌పై మరింత ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు భారత ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లపై సుంకాలు విధింనుంది. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సలహాదారు పీటర్ నవారూ.. అన్ని ఔట్‌సోర్సింగ్ సేవలపై టారిఫ్ విధించాలి’ అనే అభిప్రాయం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. దీంతో విదేశీ సేవలపై కూడా వస్తువుల్లాగే టారిఫ్ విధించాలి అనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ విధానాలు అమలైతే అమెరికా కంపెనీలు ఔట్‌సోర్సింగ్ ఖర్చులు పెరగడంతో.. భారత్ సంబంధిత కంపెనీలతో కుదుర్చుకునే కాంట్రాక్ట్‌ల విషయంలో వెనక్కితగ్గుతాయి. ప్రాజెక్టుల ఆలస్యం, లాభాల తగ్గుదల, సరఫరా గొలుసుల అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలు అమెరికా ఆధారిత వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఇంజినీర్లు, కోడర్లు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు ఎక్కువ మంది వెళుతుంటారు. ఇన్ఫోసిస్,టీసీఎస్,విప్రో,హెచ్‌సీఎల్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాల ప్రధాన స్పాన్సర్లు. ఈ వీసాల ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు..హెచ్1బీ వీసా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఈ పరిణామాలు భారత్ తన ఐటీ రంగాన్ని విస్తరించేందుకు,వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచేందుకు, అమెరికా ఆధారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ పాలనలో భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య దృశ్యాన్ని మలుపు తిప్పే అవకాశం కలిగి ఉన్నాయి.