
పిల్లలు ఎక్కడికి వెళ్లినా సరే జాగ్రత్త అని చెప్తుంటారు పేరెంట్స్. అందులోనూ వాతావరణం సరిగా లేనప్పుడు టూర్లు, ట్రిప్పులు అని బయటకు వెళ్తే కాస్త కంగారుపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు తిరిగొచ్చేస్తారా? అని ఎదురుచూస్తుంటారు. చెప్పిన మాట వినకుండా ట్రిప్పులో ఏమైనా సాహసాలు చేసేందుకు ఒడిగట్టారని తెలిస్తే ఇంటికొచ్చాక తల్లి చేతిలో అక్షింతలు పడటం ఖాయం!
సారీ అమ్మ
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) పరిస్థితి కూడా అంతే! తాజాగా ఆమె తన ట్రిప్‌కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఓ జలపాతానికి దగ్గరగా వెళ్లి సంతోషంతో గెంతులేసింది. 'నేను సురక్షితంగా ఇంటికి వచ్చేయాలని మా అమ్మ నాకోసం ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ నేనేమో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను, సారీ అమ్మ' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు నిహారిక వదిన, హీరోయిన్ లావణ్య త్రిపాఠి స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. ఈ సరదా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
నటిగా, నిర్మాతగా..
నిహారిక కొణిదెల నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా! ఒక మనసు, సూర్యకాంతం, డార్లింగ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఒరు నల్ల నాల్ పాతు సొల్రెన్, మద్రాస్‌కారన్ మూవీస్ చేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై ఓటీటీలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. హలో వరల్డ్ సిరీస్‌లో నిహారిక నటించింది కూడా! నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే తొలి సినిమా థియేటర్‌లో రిలీజ్ చేయగా ఇది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం తన బ్యానర్‌లో మరో మూవీ రూపుదిద్దుకుంటోంది.
చదవండి: అనుష్క కోసం ప్రభాస్ ఎంట్రీ.. 'ఘాటీ' స్పెషల్ గ్లింప్స్