
‘ఎప్పుడు చూసినా సెల్‌ఫోన్‌లో మునిగిపోయి కనిపిస్తారు’ అనేది యూత్ గురించి వినిపించే మాట.
అయితే ఆ సెల్‌ఫోన్ ద్వారానే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలూ కూడా చేపట్టవచ్చు అని నిరూపించారు వేములవాడ యువకులు...
అన్నదానం మహాదానం అంటారు. ఈ మాటను నిజం చేస్తూ వేములవాడ యువకులు గత 1582 రోజులుగా ‘మై వేములవాడ ట్రస్ట్’ ద్వారా స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. శుభకార్యాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని వృథా కాకుండా పేద భక్తులకు పంచిపెడుతున్నారు.
మొదట ఫ్రెండ్స్ అందరూ కలసి వాట్సాప్ గ్రూప్‌గా ఏర్పడ్డారు. సమాజానికి తమవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. ‘మై వేములవాడ ట్రస్ట్’ ఏర్పాటు చేసి పేద భక్తులకు నిత్యాన్నదానాన్ని అందిస్తున్నారు. స్థానిక పేదలు ప్రతిరోజూ ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా కడుపు నింపుకుంటున్నారు. ట్రస్ట్‌గా ఏర్పడిన తరువాత భక్తులకు నిత్యాన్నదానాన్ని అందించడంతోపాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజన్న దర్శనానికి వచ్చే వందలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తున్నారు.
‘మేము పుట్టి పెరిగిన పట్టణానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ట్రస్టుగా ఏర్పడ్డాం. అప్పటి నుంచి దాతల సహకారంతో నిత్యం అన్నదానం చేస్తున్నాం. అనాథలకు, పేదింటి ఆడపడచుల వివాహాలకు, అనారోగ్యంతో బాధపడే వారికి తోచినంత సహాయం చేస్తున్నాం’ అంటున్నాడు ‘మై వేములవాడ ట్రస్టు’ కార్యదర్శి మధు మహేశ్.
‘ఫ్రెండ్స్ అంతా కలసి ట్రస్టుగా ఏర్పడి మాకు తోచిన స్థాయిలో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాలకు వచ్చిన స్పందన మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతాం’ అంటున్నాడు ట్రస్టు ప్రతినిధి బెజ్జింకి రవీందర్.
– సయ్యద్ తాహెర్‌పాషా, సాక్షి, వేములవాడ
కులమతాలకు అతీతంగా...
కులమతాలకు అతీతంగా ‘మై వేములవాడ ట్రస్టు’ ద్వారా నిత్య సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నాం. మా పాప జన్మదినం సందర్భంగా ఇక్కడే పేదలకు అన్నదానం నిర్వహించాం. మా ప్రయత్నం చూసి మరికొందరు ముందుకు రావాలని, తమ వంతు సేవ అందించాలని కోరుకుంటున్నాం.
– మహమ్మద్ రఫీక్, ట్రస్టు ప్రతినిధి, వేములవాడ
మహాభాగ్యం
మై వేములవాడ ట్రస్ట్ సేవా యాత్రలో సేవ చేసే భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. నిత్యం పేదలకు అన్నదానం చేస్తుంటే మనసెంతో ఆనందంగా ఉంటుంది. ప్రతిరోజూ ఇక్కడకు వచ్చే వందలాది మంది భక్తులలో ఎవరూ ఆకలితో ఉండకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అన్నం వృథా కాకుండా అవసరమైన వారికి అందించడమే నిజమైన పుణ్యంగా
భావిస్తున్నాం.
– పాత సంతోష్, ట్రస్టు ప్రతినిధి, వేములవాడ