
బాడీ స్పా, హీలింగ్ థెరపీ స్పా వంటి సేవలు అందించేందుకు నగరంలో మొదటి సారి చిన్నారుల కోసం ‘బేబీ స్పా’ సేవలు అందుబాటులోకొచ్చాయి. పీడియాట్రిక్, ఫిజియోథెరపిస్టుల ఆధ్వర్యంలో అందించే ఈ బేబీ స్పా సేవలు చిన్నారుల్లో ఆరోగ్యకరమైన ఎదుగుదల, కండరాల సమృద్ధి, మోటార్ డెవలప్‌మెంట్ వంటి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బంజారాహిల్స్‌లోని ఫెర్నాండెజ్ స్టార్క్ హోమ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ బేబీ స్పా దేశంలోనే మొదటిది కాగా దీనిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన ప్రారంభించారు. ఈ ‘బేబీ స్పా’లో భాగంగా 6 వారాల నుంచి 9 నెలల వయసు శిశువులకు హైడ్రోథెరపీ, బేబీ మసాజ్‌తో పాటు ఇంద్రియాల ఉద్దీపనం, చిన్నారులు తల్లిదండ్రుల బంధాన్ని పెంపొందించే సేవలుంటాయి.
సహజంగా.. సురక్షితంగా..!!
ఈ బేబీ స్పాలో అందించే హైడ్రోథెరపీ, మసాజ్‌లు 3 వేల ఏళ్ల క్రితమే మన సంస్కృతిలో ఉండేవని, ఈ పద్దుతులను అధునాతనంగా ఈ తరానికి అందించమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని ఫెర్నాండెజ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డా.ఎవిటా ఫెర్నాండెజ్ తెలిపారు. బేబీ స్పా పద్దతులు తల్లి గర్భంలో ఉన్న చిన్నారికి కొనసాగింపుగా ఉంటాయి. యూవీ స్టెరిలైజ్డ్ ఆర్‌ఓ ఫిల్టర్ చేసిన వాటర్ టబ్స్‌లో చిన్నారులకు స్పా, గ్రేప్ సీడ్ ఆయిల్‌తో మసాజ్ వంటి సురక్షితమైన సేవలుంటాయి.
ఇవి పసిపిల్లల్లో సెన్సారింగ్, మోటార్ డెవలఫె్మంట్‌కు తోడ్పడతాయి. సైన్స్ ఆధారిత ఫలితాలతో స్పా మేలు చేస్తుంది. చిన్నారుల నిద్ర, బరువులో సమతుల్యత, శరీర అవయవాల ఎదుగుదలలో సంరక్షణను అందిస్తుంది. ఒక సెషన్ 45 నిమిషాల పాటు ఉండగా.. ఇందులో 15 నిమిషాలు నీటిలోనే థెరపీ ఉంటుందుని డాక్టర్ సుష్మ తెలిపారు.
చిన్నారుల పీహెచ్‌కు అనుగుణంగా 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌లో అందించే ఈ స్పా విధానాలు భారత్ మూలాలతో పాటు ఈజిప్ట్, మొసపటేమియా, చైనా వంటి సంస్కృతుల్లో భాగమేనని తెలిపారు. దక్షిణ ఆఫ్రికాకు చెందిన లారా ఈ బేబీ స్పాపై పరిశోధనలు చేసి అభివృద్ధి చేశారు.
తల్లీబిడ్డల శ్రేయస్సు కోసం..
బేబీ స్పా వంటి అధునాతన సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయం. దాదాపు తొమ్మిదేళ్లకు ముందే వాటర్ బర్త్ వంటి వినూత్న వైద్య సేవలను ఫెర్నాండేజ్ షౌండేషన్ నగరానికి పరిచయం చేశారు. సహజ ప్రసవాలకు ఇది కీలకంగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నర్సులకు మిడ్ వైవ్స్ పద్దతులపై అవగాహన, శిక్షణ కల్పించారు.
మన మూలాల్లోని సంప్రదాయ పద్దతులను అధునాతనంగా అందించే ఈ చికిత్సలను స్వతహాగా నా పిల్లలకు సైతం అందించాను. అధిక మొత్తంలో మెడిసిన్ కన్నా సహజంగా మిడ్ వైవ్స్ సంరక్షణ పద్దతులతో ఇలాంటి సేవలు మహిళా శిశు సంరక్షణలో కీలకంగా నిలుస్తాయి.
– హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్.