
నగరంలో తొలి మైక్రో బ్రూవరీ ఏర్పాటై దాదాపు పదేళ్లవుతోంది. అప్పటి నుంచి కేవలం సరదాగా కాలక్షేపం చేసేవారికి తప్ప.. క్రాఫ్ట్ బీర్ అతి తక్కువ మందికి మాత్రమే చేరువైంది. ఈ నేపథ్యంలో మైక్రోబ్రూవరీలను విస్తృతంగా అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయించడం నగరంలో క్రాఫ్ట్ బీర్ రంగానికి కొత్త ఉత్సాహం అందించింది.
మైక్రో బ్రూవరీ రంగం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ, పుణె తదితర నగరాలు కూడా క్రాఫ్ట్ బీర్ మార్కెట్‌లో గణనీయమైన వృద్ధిని చూపిస్తున్నాయి. స్థానిక ప్రత్యేకమైన రుచుల పట్ల వినియోగదారుల ఆసక్తి, డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా 2030 నాటికి ప్రస్తుత మార్కెట్ మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మైక్రో బ్రూవరీల సంఖ్య 300కి పైగా ఉంటే, 2030 నాటికి ఈ సంఖ్య 1,000 దాటవచ్చని విశ్లేషకుల అంచనా.
క్లబ్‌లు, ఎలైట్ లిక్కర్ షాపులు, స్టార్ హోటళ్లు తమ సొంత ఇన్–హౌస్ మైక్రో బ్రూవరీలను నిర్వహించడానికి అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్న నేపథ్యంలో నగర పార్టీ కల్చర్ కూడా కొత్త రూపు సంతరించుకోనుంది. ముఖ్యంగా తరచుగా ఈవెంట్స్ నిర్వహించే వారు కూడా ఈ బ్రూవరీల లైసెన్స్‌లు పొందే అవకాశం ఉంది. తద్వారా ఈవెంట్ల వ్యాప్తంగా బీర్ వినియోగం ఊపందుకునే పరిస్థితి కనిపిస్తోంది.
దేశీయరుచులకు తోడు ఆరోగ్య స్పృహ
బ్రూవరీలు దేశీయ రుచులకు పెద్దపీట వేస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించడానికి మామిడి, మిరియాలు, చాయ్ వంటి స్థానిక పదార్థాలను తమ బ్రూలలో కలుపుతున్నారు. పెరుగుతున్న ఆరోగ్య స్పృహకు అనుగుణంగా తక్కువ ఆల్కహాల్‌తో పాటు ఆల్కహాల్ రహిత బీర్లకు సైతం వీటి ద్వారా ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ మైక్రో బ్రూవరీలు కేవలం బీర్ డ్రింకింగ్‌కు మాత్రమే పరిమితం కావు. రుచికరమైన వంటకాలతో పాటు నగర సామాజిక కేంద్రాలుగా కూడా ఉంటున్నాయి.
ఏమిటీ క్రాఫ్ట్ బీర్?
తక్కువ ఆల్కహాల్ కలిగిన, స్థానిక తయారీదారులు తయారు చేసేవే క్రాఫ్ట్ బీర్లు. వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం లాగానే అప్పటికప్పుడు తాజాగా తయారుచేసిన బీర్ ఆర్డర్ చేసుకోవచ్చన్న మాట. ఫ్రెష్ బీర్ రుచిని నచ్చిన ఆహారంతో కలిపి ఆస్వాదించవచ్చు.
బెంగళూరు.. క్యాపిటల్ ఆఫ్ బీర్..
భారతదేశ బీర్ క్యాపిటల్‌గా పేరున్న బెంగళూరులో దాదాపు 80కిపైగా మైక్రో బ్రూవరీలు ఉన్నాయి. బీర్ ఇష్టపడే యువకుల సంఖ్య పెరుగుతండడంతో బెంగళూర్‌లో పేరున్న మైక్రో బ్రూవరీలు 10,000–15,000 చదరపు అడుగుల మధ్య ఏపటవుతున్నాయి.
ఓ బ్రూవరీ కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ ‘బ్రూవరీలు స్థానిక, అంతర్జాతీయ పదార్థాల మేళవింపుతో బీర్లను పరిచయం చేయడం ద్వారా వినియోగాన్ని ఆసక్తికరంగా మారుస్తున్నాయి. వైన్ షాప్స్‌లో అందుబాటులో ఉండే నిల్వ పానీయాలకు బదులు తాజాగా తయారుచేసినవి ఇష్టపడే 25 నుంచి 55 సంవత్సరాల వయసు గలవారే బ్రూవరీలకు రెగ్యులర్ కస్టమర్స్’ అంటున్నారు.
నగరం ఇంకా వెనుకంజే..
నగరం బీర్‌ల వినియోగంలో ముందున్నప్పటికీ.. బెంగళూరు, పుణె, ఢిల్లీ వంటి నగరాల్లో మాదిరిగా ఇక్కడ మైక్రో బ్రూవరీ సంస్కృతి ఇంకా పెద్దగా ఊపందుకోలేదు. ప్రస్తుతం, హైదరాబాద్, రంగారెడ్డిలలో కలిపి 18 మైక్రో బ్రూవరీలు ఉండగా, ఇవి సమిష్టిగా ఏటా దాదాపు 1.8 మిలియన్ బల్క్ లీటర్ల బీరును ఉత్పత్తి చేస్తాయి.
2016లో 50 కంపెనీలు దరఖాస్తు చేసుకుంటే 18 కంపెనీలు లైసెన్స్ పొందాయి. ప్రస్తుతం రాష్ట్ర 2025–26లో ఎక్సైజ్ శాఖ రూ.27,623 కోట్ల ఆదాయ లక్ష్యంతో, రాష్ట్రం తన ప్రణాళికలను పునర్‌ప్రారంభిస్తోందని అంటున్నారు. దీని ఫలితంగా ఈ మైక్రోబ్రూవరీల సంఖ్య 50కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నగరంతో పాటు వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి నగరాల్లో బ్రూవరీలను ఏర్పాటు చేయడంపై గణనీయమైన ఆసక్తి ఉందని అధికారులు చెబుతున్నారు.
(చదవండి: యువత హెల్దీ డైట్ ప్లాన్..! ఈ పోషకాలు తప్పనిసరి..)