
‘సంపూర్ణత అభియాన్’ సారథులకు సత్కారం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్య సాధనకు కృషి చేసిన అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలు సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్‌లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ కడప మాధవి కన్వెన్షన్ హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా ఆకాంక్ష జిల్లా, బ్లాకుల లక్ష్య సాధనకు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటైన సభలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఏడీపీ భాగస్వామ్య శాఖల అధికా రులు, ఫ్రెంట్‌లైన్ అధికారులు, సిబ్బందికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కడప ఆకాంక్ష జిల్లాలో ఎంపికై న చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు ఆకాంక్ష బ్లాక్‌లలో నీతి ఆయోగ్ గుర్తించిన 6 అంశాల్లో ‘సంపూర్ణత అభియాన్‘ కార్యక్రమాన్ని సంబంధిత శాఖలైన వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ, పట్టణాభివృద్ధి మొదలైన శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభు త్వం గుర్తించిన ఆరు ముఖ్యమైన సూచికల్లో (జీవన ప్రమాణాలు మెరుగు పరచుటలో) సంబంధించి సంతృప్తికర స్థాయిని పొందడమే సంపూర్ణత అభియాన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. 2024 ఫిబ్రవరి నాటికి ఆకాంక్ష జిల్లా, బ్లాకుల్లో వైద్య ఆరోగ్య రంగంలో ప్రెగ్నన్ట్ ఉమెన్ సమస్యలు, ఐసీడీఎస్‌లో బాలింత తల్లుల పోషకాహార సమస్యలు, విద్య శాఖలో మౌలిక సదుపాయలు, వ్యవసాయంలో సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ, గ్రామీణాభివృద్ధి రంగాలు, ఏఏ గ్రూపులకు బ్యాంకు రుణాలు అందజేయడం.. వంటి ఆరు అంశాల్లో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుని వచ్చి సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్యాన్ని వంద శాతం సంతృప్తికర స్థాయిలో సాధించినందుకు గాను నీతి ఆయోగ్ మన జిల్లాకు మొదటి ర్యాంకును ప్రకటించడం జరిగిందన్నారు. ఆరు ప్రామాణికాల్లో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. 2018 నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయి అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి హజరతయ్య, డీఎహెచ్‌ఓ శ్రీ నాగరాజు, ఐసీడీఎస్ పీడీ రమాదేవి, డీఈవో షంషుద్దీన్, డీఏవో చంద్రా నాయక్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఎల్డిఎం జనార్దనం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, నీతి ఆయోగ్ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు.