
అన్నదాత సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. ఎన్నికల వేళ కూటమి ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, పంట నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు పంటల భీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, నేడు దాన్ని నిరూపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖామంత్రి వ్యవసాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిల్చుంటే వ్యవసాయ శాఖ మంత్రి, రైతులు బఫే భోజనం కోసం నిల్చున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేయడం దుర్మార్గమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. యూరియా అందుబాటులో ఉందని చెబుతూనే, యూరియా వల్ల కేన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమన్నారు. వరి రైతులను నిరుత్సాహపరిచేలా, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మార్క్‌ఫెడ్‌ల ద్వారా యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం, ఆర్‌బీకేలను నిర్వీర్యం చేసిందన్నారు. కడపలోని ఆలంఖాన్‌పల్లె సొసైటీకి 50 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి సొసైటీకి ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. యూరియాపై కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రూ.270కి అమ్మాల్సిన దాన్ని రూ.600లకు విక్రయిస్తున్న పరిస్థితి ఉందన్నారు. యూరియా సరఫరాలో రూ.300 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు.
ధరల స్థిరీకరణ నిధి ఏదీ?
రాష్ట్రంలో గతం కంటే తక్కువ సాగు విస్తీర్ణం నమోదైనప్పటికీ.. సక్రమంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో పుట్టి వడ్లు రూ.16 వేలు ఉండగా, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఉందన్నారు. చీనీ టన్ను గతంలో లక్ష రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ.15 వేలే ఉందన్నారు. ఉల్లికి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ఇవ్వడం దారుణమన్నారు. కనీసం క్వింటా రూ.3 వేలతో కొనాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ నిధే ఏర్పాటు చేయలేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి భీమా కల్పించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘రైతు పోరు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేది ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ఆర్‌డీఓకు వినతి పత్రం సమర్పించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం రైతు పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు యానాదయ్య, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, దేవిరెడ్డి ఆదిత్య, సీహెచ్ వినోద్ కుమార్, షంషీర్, చెన్నయ్య, ఆర్‌వీ రమణ తదితరులు పాల్గొన్నారు.
పంటలకు దక్కని గిట్టుబాటు ధర
యూరియా సరఫరాలో విఫలం
9న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతు పోరు
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా