
ఉల్లి ధర పతనంపై ఆందోళన
కడప సెవెన్‌రోడ్స్: ఉల్లి ధరలు భారీగా పడిపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కడపలోని కలెక్టరేట్ వద్ద శనివారం ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఉల్లిగడ్డలు మార్కెట్‌లో క్వింటా వెయ్యి రూపాయలకు కూడా కొనడం లేదన్నారు. ప్రభుత్వం రూ.1200 ప్రకటించి కొనుగోలు చేస్తామంటోందని, ఈ రేటుకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా దక్కవన్నారు. ఉల్లి ఎకరం సాగు చేయడానికి రూ. 80 వేల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగదారుల మధ్య ధరల వ్యత్యాసం తగ్గించేందుకు, చీకటి మార్కెట్ల నివారణకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుత్నుప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో విజయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ సుబ్బారెడ్డి, పి.భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, ఎన్.వెంకట శివ, కేసీ బాదుల్లా, సురేష్, జి.మద్దిలేటి, వెంకట్ రాముడు, శంకర్ నాయక్, భవాని శంకర్, నాగేశ్వరరావు, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, మునయ్య, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మద్దతు రేటు రూ.3 వేలుకల్పించాలని డిమాండ్
కలెక్టరేట్ వద్ద ఉల్లిగడ్డలు తగలబెట్టిరైతు సంఘం నిరసన