
ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు భారీగా కోటిన్నర జీతమిస్తానంటున్నారు అమెరికాకు చెందిన భారత సంతతి పారిశ్రామికవేత్త దక్ష్ గుప్తా. కానీ ఆయన పెట్టిన కండీషన్ ఒక్కటే. అదేంటంటే తన స్టార్టప్‌లో ఉద్యోగంలోకి చేరేవాళ్లు వారానికి ఆరు రోజులు, రోజుకు 12-14 గంటలు (9-9-6 rule) పనిచేయాలి.
శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ప్రారంభించిన గ్రెప్టైల్ అనే స్టార్టప్ లో పలు ఉద్యోగావకాశాలను దక్ష్ గుప్తా ఇటీవల ప్రకటించారు. ఆయన ప్రకటించిన జీతం బాగానే ఉన్నా రోజుకు అన్నేసి గంటలు పనిచేయాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా 14 గంటల పని అభిప్రాయంపై ఆయన వెనక్కి తగ్గడం లేదు.
సిలికాన్ వ్యాలీలో చాలా మంది ప్రొఫెషనల్స్ వారానికి ఆరు రోజులు.. రోజుకు 12 గంటల షిఫ్టులను ఇష్టపూర్వకంగా చేస్తున్నారని గ్రెప్టైల్ ఫౌండర్ దక్ష్ గుప్తా వాదిస్తూనే ఉన్నారు. ఇప్పటి యువతరం వినోదం కంటే క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారని ‘శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్’ వార్తా సంస్థతో జరిగిన సంభాషణలో పేర్కొన్నారు. తన కంపెనీలో జరుగుతున్న పనుల వేగాన్ని ఆయన ఇదివరకే రాకెట్ ప్రయోగంతో పోల్చారు.
ఎంట్రీ లెవల్లో, గ్రెప్టైల్‌లోని ఉద్యోగులు సంవత్సరానికి 140,000 నుండి 180,000 డాలర్లు (సుమారు రూ .1.2–1.5 కోట్లు) మధ్య బేస్ వేతనం పొందవచ్చు. అదనంగా 130,000 నుంంచి 180,000 డాలర్ల విలువైన ఈక్విటీలను పొందవచ్చు. అదే ఏడేళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు అయితే బేస్ వేతనం ఏడాదికి 2,40,000 డాలర్ల నుంచి 2,70,000 డాలర్ల వరకు ఉంటుంది.
అయితే అన్నీ ఫుల్ టైమ్ ఆఫీసు ఉద్యోగాలు. అంటే రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశమే ఉండదు. తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చే పనిచేయాలి. ఇక కాంప్లిమెంటరీ మీల్స్, ట్రాన్స్‌స్పోర్ట్ ఫెసిలిటీస్, హెల్త్‌కేర్ కవర్, 401కే కాంట్రిబ్యూషన్ మ్యాచ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.