
భారతదేశ డిజిటల్ జాబ్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. కానీ ఆన్‌లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మోసాలకు ఉద్యోగార్థులు చిక్కకుండా సహాయపడటానికి, లింక్డ్ఇన్ నమ్మకాన్ని పెంపొందించడానికి, మోసాలను తగ్గించడానికి తన ధృవీకరణ సాధనాలను విస్తరిస్తోంది.
లింక్డ్ఇన్‌లో కొత్త మార్పులు
కంపెనీల పేజీ వెరిఫికేషన్ విస్తరణ: ఇప్పుడు ప్రీమియం పేజీలతో చిన్న కంపెనీలకు కూడా అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు, ఉద్యోగార్థులు, భాగస్వాములతో నమ్మకాన్ని పెంపొందించడానికి కంపెనీలకు సహాయపడుతుంది.రిక్రూటర్ వెరిఫికేషన్: "రిక్రూటర్" లేదా "టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్" వంటి టైటిల్స్‌ను జోడించే ముందు రిక్రూటర్లు వారి కార్యాలయాన్ని ధృవీకరించాలి. ఇది ఉద్యోగార్థులు తాము నిజమైన ప్రొఫెషనల్స్‌తో వ్యవహరిస్తున్నామని నిర్ధారిస్తుంది.
ఎగ్జిక్యూటివ్ టైటిల్ వెరిఫికేషన్: సీనియర్ పాత్రలకు (ఉదా. మేనేజింగ్ డైరెక్టర్, వీపీ) ఇప్పుడు వర్క్ ప్లేస్ వెరిఫికేషన్ అవసరం. తాము లీడర్‌షిప్ రోల్‌లో ఉన్నామంటూ ఎవరూ మోసం చేయకుండా ఇది నివారిస్తుంది.
80 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలు
భారత్‌లో వెరిఫికేషన్ అడాప్షన్ గత ఏడాదిలో 2.4 రెట్లు పెరిగింది. వెరిఫైడ్ యూజర్లు 60% ఎక్కువ ప్రొఫైల్ వ్యూస్, 30% ఎక్కువ కనెక్షన్ రిక్వెస్ట్‌లు, 13% ఎక్కువ రిక్రూటర్ సందేశాలను పొందుతారు. లింక్డ్ఇన్ కేవలం ఆరు నెలల్లో 80 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలను బ్లాక్ చేసింది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
మోసాల బారిన పడకుండా లింక్డ్‌ఇన్ ఇండియాలో బోర్డ్ డైరెక్టర్, లీగల్ & ప్రభుత్వ వ్యవహారాలకు కంట్రీ హెడ్‌గా ఉన్న అతిథి ఝా ఉద్యోగార్థులకు ఈ కింది సూచనలు చేశారు.
ఆన్‌బోర్డింగ్‌కు ముందు బ్యాంక్ వివరాలను పంచుకోవద్దు.
అనుమానాస్పద అభ్యర్థనలను నివారించండి-నిజమైన కంపెనీ ప్రతినిధులు డబ్బు లేదా సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌లను అడగరు.
మోసపూరిత జాబ్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
అప్డేటెడ్ సెట్టింగ్స్, రికవరీ ఎంపికలతో మీ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోండి.
లింక్డ్ ఇన్ సేఫ్టీ టూల్స్
వెరిఫైడ్ జాబ్ పోస్టింగ్స్: వెరిఫైడ్ కంపెనీలు లేదా రిక్రూటర్లను చూపించే బ్యాడ్జీలను చూడండి.
సందేశ హెచ్చరికలు: హానికరమైన కంటెంట్‌ను గుర్తించడానికి వీలు కల్పిస్తాయి.
జాబ్ ఫిల్టర్లు: వెరిఫైడ్ జాబ్స్ మాత్రమే సెర్చ్ చేయొచ్చు.
పాస్‌కీలు: సురక్షితమైన లాగిన్ కోసం డివైజ్ అన్లాక్ (వేలిముద్ర వంటివి) ఉపయోగిస్తుంది.
టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ ఖాతాకు అదనపు రక్షణను జోడిస్తుంది.