ఎంతటి అనుభవం, అవగాహన ఉన్నవారికైనా వృత్తిపరమైన జీవితంలో అనేక సందేహాలు, సందిగ్ధాలు ఎదురవుతుంటాయి. అలాంటి వాటిని ప్రొఫెషనల్ కమ్యూనిటీ వేదిక రెడిట్‌లో పంచుకుంటూ సలహాలు కోరుతుంటారు. ఇలాగే హైదరాబాద్‌కు చెందిన టెకీ కూడా తనకు ఎదురైన సందిగ్ధాన్ని షేర్ చేశారు.
ఈ హైదరబాద్ టెకీ ప్రస్తుతం సంవత్సరానికి రూ.85 లక్షల జీతంతో స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు. అయితే తనకు యూఎస్ ఆధారిత స్టార్టప్ నుంచి వచ్చిన కొత్త రిమోట్ కన్సల్టెన్సీ ఆఫర్ గురించి సబ్‌రెడిట్ (కమ్యూనిటీ గ్రూప్) ఇండియన్‌వర్క్‌ప్లేస్‌లో షేర్ చేసి ఏం చేయమంటూరు? అంటూ సలహా కోరడంతో ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది.
ఆ కొత్త స్టార్టప్‌లో ఉద్యోగానికి సంవత్సరానికి 1,10,000 డాలర్లు (సుమారు రూ.96.6 లక్షలు) జీతం ఇస్తామంటున్నారు. అయితే ఇది శాశ్వత ఉద్యోగం కాదు.. ప్రాజెక్టు ఆధారిత కన్సల్టెన్సీ కాంట్రాక్ట్. ఈ ఆఫర్‌ను తాను పరిశీలిస్తున్నప్పటికీ, పన్ను బాధ్యతలు, ఉద్యోగ భద్రత, అలాగే దీర్ఘకాలిక కెరీర్ ప్రమాదాలు వంటి అంశాలపై అనిశ్చితంగా ఉన్నట్లు టెకీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
తాను ఆ ఆఫర్‌ను అంగీకరించాలనుకుంటే, పన్ను ప్రయోజనాలను గరిష్ఠం చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ సలహా తీసుకోవడం, జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, భవిష్యత్తులో స్టార్టప్ వ్యాపారం విజయవంతంగా పెరిగితే యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చమని కోరే అవకాశం కూడా ఉందని వెల్లడించారు.
ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్ అయింది. వందలాది వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ నుంచి విభిన్న అభిప్రాయాలు వచ్చాయి. కొంతమంది ఈ ఆఫర్‌ను ప్రమాదకరంగా పేర్కొంటూ, స్థిరమైన ఉద్యోగాన్ని కొద్దిపాటి జీతం పెరుగుదల కోసం విడిచిపెట్టడం సరైంది కాదని అన్నారు.
మరికొందరు మాత్రం, వృద్ధి చెందుతున్న యూఎస్ స్టార్టప్‌లో చేరడం దీర్ఘకాలంలో పెద్ద అవకాశాలను అందించవచ్చని, ముఖ్యంగా యూఎస్ రీలొకేషన్ సాధ్యమైతే ఇది కెరీర్ బూస్టర్ అవుతుందని వ్యాఖ్యానించారు. కన్సల్టెన్సీ రోల్‌లో ఉండే ఉద్యోగ భద్రతా లోపం దృష్ట్యా ఈ వేతనం సరిపోదని, మరికొంత కోరాలని మరో యూజర్ సలహా ఇచ్చారు.
ఇదీ చదవండి: ‘కొత్త’ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు


