
టెక్ రంగంలో నూతన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లను అందిస్తోంది.
కావాల్సిన అర్హతలు ఇవే..
మెటా ప్రస్తుతం ఫుల్-స్టాక్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (full-stack software engineers), ప్రోడక్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (product software engineer)లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు..
కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.
అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత ఈ కిందివాటిలో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి..
సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్‌షిప్, థీసిస్
PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్‌లో 12 నెలల పని అనుభవం
React వంటి ఫ్రేమ్‌వర్క్‌లో పని చేసిన అనుభవం
లార్జ్ స్కేల్ స్టోరేజ్ సిస్టమ్‌లతో పని చేయగల సామర్థ్యం
iOS సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.. ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్‌లో ఉండాలి.
జీతం ఎంతంటే..
ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ ఎంట్రీ లెవల్ పాత్రలకు వార్షిక జీతం 176,000 డాలర్ల నుంచి 290,000 డాలర్ల వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.46 కోట్ల నుంచి రూ.2.41 కోట్లు అన్న మాట. జీతంతో పాటు వార్షిక బోనస్‌లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, * ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.
అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలు ఆన్-సైట్ మాత్రమే. అంటే వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్ ఉండదు.
ఈ అవకాశాల ప్రాముఖ్యత
ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.
మార్క్ జుకర్‌బర్గ్ అభ్యర్థుల్లో చూసేదిదే..
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సాంప్రదాయ విద్యా ప్రమాణాల కంటే ప్రయోజనకర నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన మాటల్లోనే.."ఒకరు ఏదైనా పనిని లోతుగా నేర్చుకొని అద్భుతంగా చేయగలరని చూపగలిగితే, వారు ఆ నైపుణ్యాన్ని ఇతర రంగాల్లో కూడా వర్తింపజేయగలరు"
కాబట్టి, అభ్యర్థులు తమ అభ్యాస నైపుణ్యాలను, సమస్యలపై అవగాహనను స్పష్టంగా చూపగలగాలి. మెటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అవకాశాలను అందుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు.. దాన్ని ప్రయోగించగలగడం ముఖ్యమైంది.
ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. చిగురించిన ఆశలు