
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. 2026 సంవత్సరం వేతన పెంపు కోసం ఉద్యోగుతల వార్షిక పనితీరు మూల్యాంకన చక్రాన్ని (annual performance review cycle) ప్రారంభించింది. దీంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జీతాల పెంపుపై (salary hike) ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అక్టోబర్ 17లోగా స్వీయ అంచనాలను సమర్పించాల్సిందిగా కంపెనీ సిబ్బందిని కోరింది.
గత రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు ఆలస్యం కావడం, తక్కువ శాతం జీతాల పెరుగుదల కారణంగా ఇన్ఫోసిస్ ఉద్యోగులు నిరుత్సాహంలో ఉన్నారు. "ఇది సాధారణ ప్రక్రియే అయినా, ఈసారి మాకు మంచి పెంపు వస్తుందని ఆశిస్తున్నాం" అని ఒక ఉద్యోగి చెప్పినట్లు ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
ఎప్పుడూ ఆలస్యమే..
ఇన్ఫోసిస్ సాధారణంగా అక్టోబర్-సెప్టెంబర్ మధ్య సమీక్షలు నిర్వహించి, జనవరిలో రేటింగ్స్, జూన్‌లో జీతాల సవరణలను విడుదల చేస్తుంది. కానీ గత కొన్ని సంవత్సరాలలో ఈ ప్రక్రియ తరచూ ఆలస్యం అవుతూ వస్తోంది.
2024 ఆర్థిక సంవత్సరంలో జూనియర్ లెవల్ 5 (JL5) స్థాయిలో ఉన్న ఉద్యోగులు జనవరిలో వేతన పెంపు పొందగా, జేఎల్ 6, అంతకంటే పై స్థాయి ఉద్యుగులు 2025 ప్రిల్ వరకు వేచి చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ, పెంపు శాతం మునుపటి సంవత్సరంతో పోలిస్తే 5-10% తక్కువగానే ఉంది.
స్వీయ మదింపు, భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి
ప్రస్తుతం, ఉద్యోగులు తమ 2025 ఆర్థిక సంవత్సరం ప్రదర్శన, కష్టాలు, విజయాలు, అభివృద్ధి లక్ష్యాలను వివరించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియలో భాగంగా..
* గత సంవత్సరం ముఖ్య భూమికలు వివరించాలి
* అభివృద్ధి చెందాల్సిన నైపుణ్యాలను హైలైట్ చేయాలి
* భవిష్యత్తు పాత్రలపై ఆకాంక్షలను పేర్కొనాలి
రేటింగ్స్ ఆధారంగా "అంచనాలను అందుకున్నారు", "ప్రశంసనీయం", "అత్యుత్తమం" ఇలా వర్గీకరణలు ఇస్తారు. ఇవే జీతాల పెంపుపై ప్రభావం చూపుతాయి.
టీసీఎస్ కూడా..
ఇన్ఫోసిస్ మాత్రమే కాదు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా తన పనితీరు మూల్యాంకనాన్ని ప్రారంభించింది. సీ3ఏ స్థాయి ఉద్యోగులకు 2025 సెప్టెంబర్ నుండి అమల్లోకి వచ్చే విధంగా పెంపులను ప్రకటించింది. అగ్రశ్రేణి పనితీరుకు రెండంకెల వృద్ధి లభించినట్లు సమాచారం.
క్యూ2 ఫలితాలు కీలకం
ఇన్ఫోసిస్ అక్టోబర్ 16న తన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు విడుదల చేయనుంది. విశ్లేషకుల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితి ఆధారంగా జీతాల పెంపు ఎలాంటి పరిమాణంలో ఉండబోతోందో స్పష్టత వస్తుంది. ఈసారైనా మంచి స్థాయిలో జీతాలు పెంపు ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: టీసీఎస్ గుడ్‌న్యూస్.. ఈసారి ఎక్కువ బోనస్!