
భారతీ ఎయిర్‌టెల్.. ఈ రోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో.. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌ను ఏర్పాటు చేయడానికి గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ చొరవతో దేశంలో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయనున్నట్లు సమాచారం.
విశాఖపట్నంలోని ఏఐ హబ్ కోసం గూగుల్ ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఎయిర్‌టెల్, అదానీకన్నెక్స్ వంటివి ఏఐ హబ్ కోసం సహకారం అందిస్తాయి. ఎయిర్‌టెల్ & గూగుల్ సంయుక్తంగా విశాఖపట్నంలో పర్పస్ బిల్ట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తాయి. అంతే కాకుండా గూగుల్ కొత్త అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్‌లను హోస్ట్ చేయడానికి అత్యాధునిక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)ను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎయిర్‌టెల్ ఒక బలమైన ఇంట్రా సిటీ, ఇంటర్ సిటీ ఫైబర్ నెట్‌వర్క్‌ను కూడా సృష్టిస్తుంది.
భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. గూగుల్‌తో ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఒక నిర్ణయాత్మక క్షణం. ప్రపంచ స్థాయి ఏఐ మౌలిక సదుపాయాలను పెంచడానికి మేము సహకరిస్తామని అన్నారు. ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేస్తూ, మేము తదుపరి తరం ఏఐ సేవలను అందిస్తామని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ పేర్కొన్నారు.