
టీసీఎస్ లేఆఫ్‌ల ప్రకటన తర్వాత దేశ ఐటీ పరిశ్రమలో కల్లోల వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ఐటీ ఉద్యోగార్థులకు దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది 20,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ధృవీకరించారు.
మొదటి త్రైమాసికంలో 17,000 మందిని (స్థూల నియామకాలు) నియమించుకున్నామని, ఈ ఏడాది ఇంఆ 20,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రీస్కిల్లింగ్లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా కంపెనీ కాస్త ముందంజలో ఉందన్న పరేఖ్.. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో 2,75,000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
పోటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈవో నియామకాలను ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మరే ఇతర భారతీయ ఐటీ కంపెనీ కూడా ఈ స్థాయిలో లేఆఫ్లను ప్రకటించలేదు.
ఏఐ ప్రభావంపై..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి పరేఖ్ మాట్లాడుతూ, "కృత్రిమ మేధ లోతైన ఆటోమేషన్, అవగాహనను అందిస్తుంది. అదే సమయంలో ఉన్నత స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ అవసరం" అని అన్నారు. ఉద్యోగులు,సాంకేతికత రెండింటి పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిని విస్తరిస్తుందని పేర్కొన్నారు.
వేతనాల పెంపుపై..
గత ఆర్థిక సంవత్సరం క్యూ4, క్యూ1లకు వేతనాల పెంపును కంపెనీ ఇప్పటికే పూర్తి చేసిందని పరేఖ్ తెలిపారు. "ఇప్పుడు ఈ సైకిల్ పూర్తయింది. ఎప్పటిలాగే తదుపరి రౌండ్ కోసం సమయాన్ని అంచనా వేయడం ప్రారంభించాం. మా ప్రస్తుత ప్రక్రియకు కట్టుబడి ఉంటాం. సరైన సమయంలో తదుపరి రౌండ్ను ప్రకటిస్తాం" అని పరేఖ్ వివరించారు.
👉 ఇదీ చదవండి: TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!