మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు.. రెట్టింపు | India mobile phone exports rise 95 pc to 1. 8 bn September | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు.. రెట్టింపు

Oct 15 2025 12:36 AM | Updated on Oct 15 2025 12:36 AM

India mobile phone exports rise 95 pc to 1. 8 bn September

సెప్టెంబర్లో 1.8 బిలియన్‌ డాలర్లు 

ఆరు నెలల్లో 13.5 బిలియన్‌ డాలర్లు 

70 శాతం అమెరికా మార్కెట్‌కే

న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు సెప్టెంబర్ నెలలో జోరుగా సాగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 95 శాతం అధికంగా 1.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదైనట్టు ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) ప్రకటించింది. ‘‘సాధారణంగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎగుమతులు స్తబ్దుగా ఉంటుంటాయి. ఉత్పత్తి, సీజన్‌ వారీ రవాణా పరిస్థితులు ఇందుకు కారణం.

అయినప్పటికీ ఎగుమతులు పటిష్టంగా నమోదు కావడం అన్నది దేశీయంగా బలమైన ఎకోసిస్టమ్‌ (తయారీ) ఏర్పడినట్టు తెలియజేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్ వరకు మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 13.5 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 8.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అంటే 60 శాతం అధిక ఎగుమతులు జరిగినట్టు తెలుస్తోంది. దేశ మొబైల్‌ ఫోన్ల పరిశ్రమ తయారీ, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఇవి కీలక ఆయుధాలు’’అని ఐసీఈఏ పేర్కొంది.  

అమెరికాకు మూడింతలు 
భారత్‌ నుంచి అమెరికా మార్కెట్‌కు ఏప్రిల్‌–సెప్టెంబర్ కాలంలో 9.4 బిలియన్‌ డాలర్ల మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 3.1 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో పోల్చి చూస్తే మూడింతలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొబైల్‌ ఫోన్ల ఎగుమతుల్లో 70 శాతం మేర (9.4 బిలియన్‌ డాలర్లు) అమెరికా మార్కెట్‌కే వెళ్లడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం ఎగుమతుల్లో అమెరికా మార్కెట్‌కు వెళ్లిన మొత్తం 37 శాతంగా ఉంది.

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద (2025–26) మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 35 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 24.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ‘‘మొబైల్‌ ఫోన్‌ పరిశ్రమలో తదుపరి దశ వృద్ధి అన్నది ఇప్పటి వరకు సాధించిన సామర్థ్యాలు, పోటీతత్వాన్ని కొనసాగించడంపైనే ఆధారపడి ఉంటుంది. విడిభాగాల తయారీ ద్వారా మన సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది’’అని ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement