
యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 6జీ కనెక్టివిటీ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 145 గిగాబిట్స్ పర్ సెకన్ (Gbps) ఇంటర్‌నెట్ వేగాన్ని సాధించినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. ఈ టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. కనెక్టివిటీలో అసాధారణ వేగం, అతి తక్కువ జాప్యం (Ultra low Latency) వంటి అంశాలు భవిష్యత్ డిజిటల్ ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా 6జీ టెక్నాలజీ అభివృద్ధిలో చురుకుగా ముందుకు సాగుతోంది.
భారత్‌లో పరిశోధనలు
భారతదేశం కేవలం 6జీ టెక్నాలజీని స్వీకరించే దేశంగా కాకుండా దాని రూపకల్పన, అభివృద్ధి, ప్రమాణాలను నిర్దేశించడంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దేశంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో భారత్ 6జీ విజన్‌ను ప్రారంభించింది. 2023 మార్చి 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ 6జీ విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు. 2030 నాటికి ఈ టెక్నాలజీలను రూపొందించి దేశీయంగా అమలు చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. దేశీయ పరిశ్రమ, విద్యాసంస్థలు, జాతీయ పరిశోధనా సంస్థలు, ప్రమాణాల సంస్థల సహకారంతో 2023 జులై 3న భారత్ 6జీ కూటమిని ప్రారంభించారు. భారత్ 6జీ విజన్‌కు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల చర్చల్లో చురుకుగా పాల్గొనడం, పరిశోధనలకు నిధులు సమకూర్చడం దీని విధుల్లో భాగం.
టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (TTDF) పథకం కింద 6జీ టెక్నాలజీకి సంబంధించిన 104కి పైగా పరిశోధన ప్రాజెక్టులకు రూ.275.88 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. దేశంలోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థల్లో 6జీకి సిద్ధంగా ఉండే పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి 100 5జీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి భవిష్యత్తులో 6జీ పరిశోధనలకు వేదికగా మారుతాయి.
🚨 The UAE has successfully completed its first 6G testing, achieving a record speed of 145 Gbps. pic.twitter.com/uhtmRk6Zrv
— Indian Tech & Infra (@IndianTechGuide) October 15, 2025
ఇండియాలో 6జీ వస్తే చోటు చేసుకోనున్న పరిణామాలు
ఇండియాలో ‘భారత్ 6జీ విజన్’ కింద 6జీ సాంకేతికతను 2030 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ వంటి అతిపెద్ద జనాభా గల దేశంలో 6జీ రాక వల్ల భారీ పరివర్తనలు సంభవిస్తాయి.
డిజిటల్ విప్లవం: 6జీ గ్రామీణ, సరైన కనెక్టివిటీలేని ప్రాంతాలకు సైతం మెరుగైన కమ్యునికేషన్ అందిస్తుంది.
ఆరోగ్య సంరక్షణ (Healthcare): రియల్-టైమ్ టెలిసర్జరీలు, రిమోట్ పేషెంట్ మానిటరింగ్, ఏఐ-ఆధారిత డయాగ్నోస్టిక్స్ వంటివి విస్తృతం అవుతాయి. అంబులెన్స్‌లు, ఆసుపత్రులు సహా అన్ని వైద్య మౌలిక సదుపాయాలు ఏఐ ఆధారితంగా అనుసంధానమవుతాయి.
విద్య (Education): విద్యార్థులు వర్చువల్ టీచర్‌లతో, క్లాస్‌మేట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్కడైనా, ఎప్పుడైనా నాణ్యమైన విద్యా వనరులను పొందేందుకు 6జీ ఉపయోగపడుతుంది.
పరిశ్రమల ఆటోమేషన్ (Industrial Automation): స్మార్ట్ ఫ్యాక్టరీల్లో యంత్రాల రియల్-టైమ్ రిమోట్ కంట్రోల్, ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, రోబోటిక్స్ వంటివి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నాణ్యతను అసాధారణంగా పెంచుతాయి.
రవాణా (Transportation): అర్బన్ ఎయిర్ మొబిలిటీ (UAM), అటానమస్ వాహనాల (Self-Driving Cars) కోసం 6జీ కమ్యూనికేషన్ అత్యంత అవసరం. ట్రాఫిక్ నిర్వహణ, లాజిస్టిక్స్‌లో డ్రోన్ ఫ్లీట్‌ల వాడకం పెరుగుతుంది.
రక్షణ రంగం (Defence): కమాండర్లకు వేగవంతమైన, రియల్-టైమ్ క్షేత్ర సమాచారం అందించేందుకు వీలవుతుంది. సురక్షితమైన కమ్యూనికేషన్, డ్రోన్లు, హైపర్‌సోనిక్ ఆయుధాలకు కమ్యూనికేషన్ లింక్‌లు అందించడం ద్వారా రక్షణ సామర్థ్యం పెరుగుతుంది.
ఈ టెక్నాలజీ వివిధ దేశాల పరిశోధనలు
ప్రస్తుతానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ పూర్తిగా వాణిజ్యపరమైన (Commercial) 6జీ నెట్‌వర్క్ వాడుకలో లేదు. 6జీ సాంకేతికతను 2030 నాటికి వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి, పరిశోధన (R&D)లో వివిధ దేశాలు, టెక్ కంపెనీలు చురుగ్గా పోటీ పడుతున్నాయి.
6జీ అభివృద్ధిలో ముందున్న దేశాలు
చైనా: 6జీ పరిశోధన, అభివృద్ధిలో ముందంజలో ఉంది. చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. టెరాహెర్ట్జ్ సిగ్నల్ ప్రసారాన్ని పరీక్షించేందుకు ఇప్పటికే ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని (Experimental Satellite) ప్రయోగించింది. 6జీ పేటెంట్ ఫైలింగ్స్‌లో చైనా అగ్రస్థానంలో ఉంది.
దక్షిణ కొరియా: 5జీని వేగంగా అమలు చేసిన దక్షిణ కొరియా 6జీలో కూడా బలమైన పోటీదారుగా ఉంది. శాంసంగ్, ఎల్‌జీ వంటి దిగ్గజ సంస్థలు 6జీ R&D కేంద్రాలను ఏర్పాటు చేశాయి. 2028 నాటికి 6జీని వాణిజ్యపరంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
జపాన్: టెక్నాలజీ అభివృద్ధిలో తన నైపుణ్యాన్ని కొనసాగిస్తూ 2030 నాటికి 6జీని ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
యునైటెడ్ స్టేట్స్, యూరప్: యూఎస్ ‘నెక్స్ట్ G అలయన్స్’ ద్వారా ఈయూ ఆధ్వర్యంలో ‘హెక్సా-ఎక్స్’ (Hexa-X) వంటి చొరవలతో 6జీ పరిశోధనలో చురుకుగా పాల్గొంటున్నాయి.
ఇదీ చదవండి: ఓ మై గోల్డ్!