
ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో అందుకు టెక్నాలజీ సపోర్ట్ అందించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 5జీ కనెక్టివిటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. దాంతో టెలికాం పరికరాల విభాగంలో టీసీఎస్ ఎదిగేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. గ్లోబల్ టెలికాం కంపెనీలు ఇప్పటికే భారతదేశ టెలికాం రంగంపై ఆసక్తి చూపుతున్నాయని టీసీఎస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సక్సరియా చెప్పారు.
ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ.. ‘బీఎస్‌ఎన్‌ఎల్‌కు అందించిన టెక్నాలజీ మౌలిక సదుపాయాలు నాణ్యత పరంగా పరిశ్రమ బెంచ్‌మార్క్‌లను మించి ఉన్నాయి. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో కంపెనీ ఈ విభాగంలో విస్తరించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బీఎస్‌ఎన్‌ఎల్ తదుపరి కనెక్టివిటీ కార్యకలాపాల్లోనూ పాల్గొంటాం. బీఎస్‌ఎన్‌ల్ 4జీ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా భారత్‌లో మాత్రమే కాకుండా 5జీ, ప్రపంచవ్యాప్తంగా 4జీ కోసం ఇలాంటి సర్వీస్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులను చేపట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఇటీవల దేశవ్యాప్తంగా 4జీ కనెక్టివిటీని అందించేందుకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంతో ఇటీవల ప్రధాని చేతుల మీదుగా దేశంలోని అన్ని టవర్ల పరిధిలో బీఎస్‌ఎన్‌ఎల్ 4జీని ప్రారంభించింది. గత మే నెలలో 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి రూ.2,903.22 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు టీసీఎస్ గతంలో తెలిపింది.
ఇదీ చదవండి: రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు..