
సంతకాలు చేసిన భారత్ 6జీ అలయెన్స్, 9 గ్లోబల్ సంస్థలు
న్యూఢిల్లీ: 6జీ వ్యవస్థను సురక్షితంగా, స్వేచ్ఛగా, సమ్మిళితంగా ఉంచేందుకు ఉపయోగపడే సూత్రాలకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్‌పై భారత్ 6జీ అలయెన్స్‌తో పాటు తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి. నెక్ట్స్‌జీ అలయెన్స్, 6జీ బ్రెజిల్, జపాన్‌కి చెందిన ఎక్స్‌జీ మొబైల్ ప్రమోషన్ ఫోరం మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ భారత్ 6జీ సింపోజియంలో దీన్ని ప్రకటించారు.
డిజిటల్ అంతరాలను భర్తీ చేసే విధంగా, పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ విశ్వసనీయమైన.. అఫోర్డబుల్ కవరేజీని అందించే విధంగా 6జీ ఉండాలని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన, నిష్పాక్షికమైన వాతావరణంలో ప్రపంచ దేశాల, ప్రాంతాల, భాగస్వాముల సమాన ప్రాతినిధ్యంతో ప్రమాణాలను రూపొందించాల్సి ఉంటుందని వివరించాయి.
పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలు, టెస్ట్‌బెడ్స్, పైలట్ ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేయాలని పేర్కొన్నాయి. విశ్వసనీయమైన టెక్నాలజీలను, ఓపెన్ ప్రమాణాలను, సుస్థిర నెట్‌వర్క్‌లను సమిష్టిగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను ఈ డిక్లరేషన్ సూచిస్తోందని భారత్ 6జీ అలయెన్స్ డైరెక్టర్ జనరల్ ఆర్‌కే పాఠక్ తెలిపారు. 6జీ ట్రయల్స్ 2028లో ప్రారంభమవుతాయని, వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవడానికి మరికొన్నాళ్లు పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
ఏఐతో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు ..
టెలికం సేవలు 5జీ నుంచి 6జీకి మారుతున్న తరుణంలో సమస్యలేవైనా వస్తే టెలికం నెట్‌వర్క్ దానంతటదే పరిష్కరించుకునేలా, కస్టమర్లకు మరింత మెరుగైన సరీ్వసులను అందించేలా కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగపడుతుందని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు.
ఏఐని మంచికే ఉపయోగిస్తున్నప్పటికీ దుర్వినియోగమయ్యే రిసు్కలు కూడా ఉన్నందున, ఈ టెక్నాలజీ వినియోగంపై అప్రమత్తత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ ఆధారిత టూల్స్ ఏ విధంగా డీప్ ఫేక్స్, వాయిస్ క్లోనింగ్, ఆర్థిక మోసాలు చేసేందుకు దుర్వినియోగమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం టెలికం నెట్‌వర్క్‌లో ఏఐ విషయంలో చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి‘ అని మిట్టల్ వివరించారు. టెలికం శాఖ రూపొందించిన ఏఐ ఆధారిత ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ టూల్‌ని ఉపయోగించి 48 లక్షల అనుమాస్పద లావాదేవీలను బ్లాక్ చేసినట్లు, రూ. 200 కోట్ల నష్టాన్ని నివారించినట్లు పేమెంట్ యాప్స్ అయిన ఫోన్‌పే, పేటీఎం ప్రకటించాయి.