
ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏడాదికి రూ.75 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది.. తీసుకోవాలా.. వద్దా అని సందిగ్ధంలో ఉన్నానని ఇటీవల ఓ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలో అధిక పన్ను కారణంగా ఈ ఆఫర్‌ను తాను స్వీకరిస్తానని ఖచ్చితంగా చెప్పలేనన్నారు.
తాను ఇప్పటికే దాదాపు రూ.12 లక్షల పన్నులు చెల్లిస్తున్నానని, కొత్త జాబ్ ఆఫర్ స్వీకరిస్తే ఆ పన్ను మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ.22 లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. ‘20 ఏళ్ల అనుభవంతో ప్రస్తుతం భారత్ లో ఏటా రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. ఈ మధ్యనే రూ.75 లక్షలకు ఆఫర్ వచ్చింది. ఇది గణనీయమైన పెరుగుదల అయినప్పటికీ, ప్రధానంగా పన్ను బాధ్యతలో విపరీతమైన పెరుగుదల కారణంగా దానిని అంగీకరించాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం రూ.12 లక్షల వరకు పన్నులు చెల్లిస్తున్నాను. రూ .50 లక్షలకు పైగా ఆదాయంపై వర్తించే అదనపు 10% సర్‌ఛార్జ్ కారణంగా కొత్త ఆఫర్‌తో ఆ మొత్తం దాదాపు రెట్టింపు అయి రూ .22 లక్షలకు చేరుకుంటుంది" అని యూజర్ రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ట్యాక్స్ ఎక్కువ కట్టేందుకు పనిచేయాలా?
కొత్త వేతన నిర్మాణంలో పన్ను ఆదా చేసే అంశాలను చేర్చే వెసులుబాటు లేదని ఆయన అన్నారు. ‘కాబట్టి, నా టేక్-హోమ్ వేతనం సుమారు 50% పెరగవచ్చు, పన్ను భారం దాదాపు రెట్టింపు అవుతుంది. తక్కువ పన్ను లేదా అస్సలు చెల్లించని వారితో పోలిస్తే ఎటువంటి అదనపు స్పష్టమైన ప్రయోజనాలను పొందకుండా, ప్రభుత్వానికి ఎక్కువ పన్ను చెల్లించడానికి నేను ఎందుకు ఎక్కువగా కష్టపడాలి?" అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. సదరు వ్యక్తికి వచ్చిన సందిగ్ధ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తూనే అభిప్రాయాలనూ వ్యక్తీకరించారు. నేరుగా ఉద్యోగంలో చేరకుండా కన్సల్టెంట్ గా పరిహారం అందుకుంటే పెద్ద మొత్తంలో పన్ను ఆదా చేసుకోవచ్చని, కానీ ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ చెల్లించడం ఇష్టం లేక వేతన పెంపు తీసుకోకపోవడం సరికాదంటూ ఓ యూజర్ సలహా ఇచ్చారు. ఇప్పుడొస్తున్న దానికంటే 50% ఎక్కువ జీతం వస్తున్నా కూడా ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి జాబ్ ఆఫర్‌ను వదులుకుంటాననడం మూర్ఖత్వం అని మరో వ్యక్తి పేర్కొన్నారు.
దేశంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ .4 లక్షల వరకు ఆదాయంపై సున్నా పన్ను ఆ తర్వాత 5% నుండి 30% వరకు పన్ను రేట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు (వేతన జీవులకు రూ.12.75 లక్షలు) అధిక రిబేట్, స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత విధానం ఎంచుకునేవారికి 80సీ, హెచ్ఆర్ఏ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు ఉన్నాయి. అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకు సర్ ఛార్జీలు వర్తిస్తాయి.
👉 ఇదీ చదవండి: ఐటీ రిటర్న్ కొత్త డెడ్‌లైన్.. మిస్ అయితే పెద్ద తలనొప్పే!