
దేశంలో ప్రస్తుతం ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సీజన్ నడుస్తోంది. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం భారతీయ పన్ను చెల్లింపుదారులందరికీ కీలకమైన బాధ్యత. అన్ని ఆదాయ మార్గాలను ప్రకటించడం, అర్హత వ్యయాలను మినహాయించడం, పన్ను బాధ్యతలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించడంతో పాటు పన్ను చట్టాలను పాటించడం అవసరం.
ఐటీఆర్ దాఖలుకు కొత్త డెడ్‌లైన్
2024–25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025–26) నాన్ ఆడిట్ పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ దాఖలు చేయడానికి సాధారణంగా జూలై 31 వరకూ గుడువు ఉంటుంది. అయితే ఈసారి గడువును 2025 సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. ఒకవేళ గడువు దాటితే ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించి 2025 డిసెంబర్ 31లోగా లేట్ రిటర్న్ దాఖలు చేయవచ్చు.
గడువు దాటిపోతే పర్యవసానాలు
ఐటీఆర్ దాఖలు చేయకుండా గడువు దాటిపోతే సెక్షన్ 234ఏ కింద తీవ్రమైన జరిమానాలు, అభియోగాలు, సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
వడ్డీ: గడువు తర్వాత మీరు మీ రిటర్న్ సబ్మిట్ చేస్తే, సెక్షన్ 234ఎ కింద చెల్లించని పన్ను మొత్తంపై నెలకు 1% లేదా ఒక నెలలో కొంత భాగం వడ్డీ చెల్లించాలి.
ఆలస్య రుసుము: సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుము వసూలు చేస్తారు. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉంటే రూ.5,000, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వసూలు చేస్తారు.
నష్టాల సర్దుబాటు: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇళ్లు లేదా మీ వ్యాపారాల నుండి మీకు నష్టాలు వచ్చి ఉంటే వాటిని మరుసటి సంవత్సరం మీ ఆదాయానికి వ్యతిరేకంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల తరువాతి సంవత్సరాలలో మీరు చెల్లించాల్సిన పన్ను గణనీయంగా తగ్గుతుంది. అయితే గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఈ నష్టాలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉండదు.