
మా మామగారు నామీద ఒక చీటింగ్ కేసు నమోదు చేశారు. అంతకుముందు నా భార్య నా మీద గృహ హింస కింద కూడా అదే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. కౌన్సెలింగ్ పేరుతో చాలాసార్లు పిలిచి పోలీసు వారు వేధించారు. ఆఖరికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కొత్త చీటింగ్ కేసు నెపంతో తరచుగా పోలీస్ స్టేషన్‌కు పిలిచి సెటిల్మెంట్ చేయవలసిందిగా ఒత్తిడి చేస్తూ నా ఆస్తి ఒకటి రాసిమ్మని అలాగే నా వద్దనే ఉన్న నా కొడుకుని కూడా ఇచ్చేయాలి అంటూ బలవంతం చేస్తున్నారు. గంటలకొద్దీ కూర్చోబెడుతున్నారు. మా మామగారికి పోలీసులలో చాలామంది పరిచయస్తులు ఉన్నారు. వారి సహాయంతో ఇదంతా చేస్తున్నారు అని, నేను ఏమీ చేయలేను అని అందరికీ చెప్తున్నారు. ఇటీవలే స్త్రీ – శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా బాబు కస్టడీ ఇవ్వాలి అంటూ ఒక నోటీసు అందింది. ఈ వేధింపులను ఆపే మార్గం లేదా?
– గణేష్, మేడ్చల్
ఫ్యామిలీ కేసు, సివిల్ కేసు అనే తారతమ్యం కూడా లేకుండా పోలీసు వారు నిందితులను తరచుగా పోలీస్ స్టేషన్‌కు పిలిచి గంటల తరబడి కూర్చోబెట్టడం, సెటిల్మెంట్ చేసుకోవాలి అని ఒత్తిడి చేయడం సరైనది కాదు – అది అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది అంటూ పలు హైకోర్టులు చాలాసార్లు వివిధ పోలీసు అధికారులను మందలించాయి.
ఒకవేళ మీ కేసులో కూడా ఇలాంటి ఒత్తిళ్లకు గురి చేస్తుంటే మీరు ముందుగా పై అధికారులకు ఫిర్యాదు చేయండి. అప్పటికీ కూడా మీకు పరిష్కారం లభించకపోతే పోలీసువారి అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ, మిమ్మల్ని వేధించడానికి వీలు లేదు అని, నోటీసులు లేకుండా పోలీస్‌స్టేషన్‌కు పిలిచి గంటలు తరబడి కూర్చోబెట్టడం అన్యాయం అని డిక్లేర్ చేయమని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయండి.
హైకోర్టు మిమ్మల్ని కచ్చితంగా కాపాడుతుంది. మీ కొడుకు మీ వద్దనే ఉన్నారు అని చెప్తున్నారు కానీ అతని వయసు చెప్పలేదు. మీకు స్త్రీ – శిశు సంక్షేమ శాఖ నుండి వచ్చిన నోటీసు కూడా బహుశా సరైనది కాకపోవచ్చు. చిన్న పిల్లల పోషణకు, శ్రేయస్సుకు – రక్షణకు భంగం కలుగుతుంది అని కచ్చితమైన సమాచారం ఉంటే తప్ప, పిల్లల కస్టడీ విషయాలలో కేవలం ఫ్యామిలీ కోర్టుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఏది ఏమైనా మీరు హైకోర్టులో ఆ నోటీసును కూడా ప్రత్యేకంగా రిట్ పిటిషన్ ద్వారా ఛాలెంజ్ చేయండి. సరైన పరిష్కారం దొరుకుతుంది.
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకి మెయిల్ చేయవచ్చు)
(చదవండి: రచయితలుగా పోలీసు అధికారులు..!)