
ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ ఓ రైటర్ ఉంటారు. ఆయన ఆ ఠాణాతోపాటు కేసులకు సంబంధించిన రికార్డుల్ని నిర్వహిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే కొందరు పోలీసుల్లోనూ రైటర్ ఉంటున్నాడు. ఇలా రచయితలుగా మారిన అధికారులు ఎందరో ఉండగా... అతి తక్కువ మంది మాత్రమే తమ వృత్తికి భిన్నమైన అంశాలను ఎంచుకున్నారు... కుంటున్నారు. పోలీసు విభాగంలో తమకు ఎదురైన అనుభవాలు, పోలీసింగ్‌లో ఉన్న లోపాలు, చట్టాలు తదితరాలపై పోలీసులు, మాజీ పోలీసులు పుస్తకాలు రాయడం కామనే. అయితే దీనికి భిన్నంగా భాష, సాహిత్యాలపై రాస్తున్న వాళ్లు అరుదు. అలాంటి వారి జాబితాలో దివంగత బయ్యారపు ప్రసాదరావు, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ ఉదాహరణలు మాత్రమే.
స్వగతం సహా ‘ఎ’న్నో కథలు
ఆంగ్లంలో లిటరేచర్‌తో పాటు లా కూడా పూర్తి చేసిన చిలుకూరి రామ ఉమా మహేశ్వర శర్మ ఎస్పీ హోదాలో పదవీ విరమణ చేసిన తర్వాత తెలుగు రచయితగా మారారు. అప్పట్లో ఖమ్మం, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సత్యనారాయణపురానికి చెందిన శర్మ 1985లో ఎస్సైగా ΄ోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. 2019 లో ఉద్యోగ విమరణ చేసిన ఆయన తన తొలి పుస్తకం ‘నేను శాంత కూడా – ఓ జీవన కథ’ను 2021లో విడుదల చేశారు.
ఇందులో కేవలం తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అంశాలు, ఆద్యంతం తన భార్య శాంత ఇచ్చిన సహకారం తదితరాలను ప్రస్తావించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో శర్మ రెండోపుస్తకం ‘ఎ’ ఆవిష్కృతమైంది. ఇందులో సమకాలీన అంశాలను స్ఫృశించిన ఆయన మహిళలు, ట్రాన్స్‌జెండర్ల జీవితం, స్త్రీ, పురుష సంబంధాలు, సమాజం నిర్మించిన నైతికచట్రపు విలువలు తదితరాలను నిశితంగా ప్రశ్నిస్తూ షార్ట్ స్టోరీలు ఉంటాయి.
ఒకే మూసలోకి ఒదగని ఈ కథలు చెప్పేతీరు కూడా కథ, కథకి మారుతూ మనుషుల ప్రవర్తనలను, ఆలోచనలను వాటి వెనక ఉద్దేశాన్ని చూపిస్తుంటుంది. వైవిధ్యత, వాస్తవికత, మానవీయ దృక్పథం, చక్కటి చమత్కారాలతో సాగే కథల్ని రాసిన శర్మ తనలోని మరో కోణాన్ని చూపించారు.
ఫిజిక్సే కాదు..ఆంగ్లంలోనూ...
విజయవాడలో ఓ కానిస్టేబుల్ కుమారుడిగా పుట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆఖరి డీజీపీగా, రాష్ట్రవిభజన తర్వాత ఏపీకి మొదటి హోమ్ సెక్రటరీగా పని చేసిన డాక్టర్ బయ్యారపు ప్రసాదరావులోనూ ఓ రచయిత ఉన్నారు. తన ఇంట్లోనే ఓ పెద్ద ఫిజిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్న ఆయన ‘థీరీ ఆఫ్ లైట్’లోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ ‘న్యూ లైట్ ఆన్ లైట్’ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసి డాక్టరేట్ పొందారు. 1977లో మద్రాస్ ఐఐటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, 1979లో ఐపీఎస్‌గా ఎంపికైనా ఆయనకు ఆంగ్లం నేర్చుకోవాలన్న తపన పోలేదు.
దీనికోసం అనేక ప్రయత్నాలు చేసిన ఆయన తానే సొంతంగా ఓ విధానం రూపొందించాలని అనుకున్నారు. 1984లో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఉండగా ఓరోజు కాకినాడ నుంచి అమలాపురం ప్రయాణించారు. అప్పుడు ఆయనకు ఓ ఆలోచన వచ్చింది. ఆంగ్లపదాలను అలాగే చదివితే అవి అంతగా గుర్తుండటం లేదు. ఈ నేపథ్యంలో వీటిని వాక్యాలుగా, వ్యాసాలుగా మార్చాలని భావించారు. ఇలా తన ఇష్టమైన సబ్జెక్ట్ అయిన ఫిజిక్స్‌లోని సూత్రాలు, కొన్ని కల్పిత ఉదంతాలతో కథనాలుగా అల్లి ప్రాక్టీసు చేశారు. తొలిసారిగా 20 కొత్త పదాలతో ప్రయత్నించగా... అమలాపురం చేసేసరికి 17 తేలిగ్గా గుర్తుపెట్టుకోవడం సాధ్యమైంది. అలా ఆ మార్గం పట్టిన ప్రసాదరావు దాదాపు పదేళ్లపాటు ప్రాక్టీసు కొనసాగించారు.
11 వేల పదాలు... 500 కథనాలు... అదనపు ఎస్పీ నుంచి ఆయన హోదాలు మారుతున్నప్పటికీ ఆయన ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఇలాంటి అంశాలతో ఆయన రాసిన పుస్తకం ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ 2012 సెప్టెంబర్ 12న నాటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. 2014లో రిటైర్ అయిన ప్రసాదరావు 2021 మేలో అమెరికాలో కన్నుమూశారు.
నవరసాలు నిండిన ‘పుంజుతోక’
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పని చేసి, తాజాగా ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ముక్కుసూటి అధికారిగా పేరున్న శ్రీనివాస్‌రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట. బషీర్‌బాగ్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ పీజీ కాలేజీ నుంచి ఎంకాం, ఆపై ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ కోర్స్, హంగేరీలో యాంటీ టెర్రరిజం అసిస్టెన్స్ కోర్స్ చేశారు.
1994లో ఐపీఎస్ అధికారిగా లీసు విభాగంలో అడుగుపెట్టి ఇటీవలే ఉద్యోగ విరమణ చేశారు. 30 ఏళ్ల తన సర్వీసులో ఎదురైన అనుభవాలన్నింటినీ రంగరిస్తూ ఆయన 120 కవితలుగా అక్షరీకరించారు. మొదట్లో దీనికి ‘కాక్‌టెయిల్ పద్యాలు’ అంటూ ఇంగ్లీషులో టైటిల్ పెట్టాలని భావించిన ఆయన చివరకు ‘పుంజుతోక’ అంటూ తెలుగీకరించారు. ‘అందరిలా కాదు నేను నాలాగే’ అనే కవితతో సంకలనం ప్రారంభించారు.
‘చాలామందికి కేవలం ఓ ఐపీఎస్ అధికారిగానే సుపరిచితుడిని. పదవీ విరమణ రోజు రచయితగా పరిచయం చేసుకున్నా. ఈ పుస్తకంలో నా ఆత్మ సాక్షాత్కారం ఉంటుంది. ఇన్నేళ్ల నాజీవితంలో నాకు ఎదురైన అనుభవాలకు నిజాయితీతో కూడిన అక్షర రూపమే ఈ కవితా సంపుటి. సామాజిక స్పృహ, సంఘ సంక్షేమం, ప్రకృతిపై ఉన్న ప్రేమ ప్రధానాంశాలుగా ఉంటాయి. సామాజిక, మానవతా విలువలు అంతఃసూత్రంగా సాగే కవితలివి. ఈ ‘పుంజుతోక’ పాఠకులకు నచ్చుతుందని నా విశ్వాసం’ అని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
(చదవండి: దేశంలోనే తొలి మహిళా మావటి..!)