
పొట్టివాడైనా..గట్టివాడమ్మ అన్న నానుడిలా ..ఓ మహిళ అత్యున్నత స్థాయికి చేరుకుని శెభాష్ అనిపించుకుంది. అది శారీరక లోపం కాదు..విభిన్నంగా చూపే విశిష్ట లక్షణంగా భావించింది. అదే తన ఉన్నతికి సోపానంగా మార్చి.. తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే రేంజ్‌కి చేరుకుంది. తనను చూడగానే శారీరక లోపం కాదు..సాధించిన విజయమే తలంపుకు వచ్చేలా అందరి మదిలో చిరస్థాయిగా నిలిచేలా అనితర సాధ్యమైన సక్సెస్‌ని అందుకుని యావత్తు ప్రపంచం తనవైపుకి తిరిగేలా చేసుకుంది.
ఆమెనే డెహ్రాడూన్‌కి చెందిన ఆర్తి డోగ్రా. తన శారీరక ఎత్తు సమాజం నుంచి అవహేళనలు, అవమానాలను బహుమతులుగా అందంచింది. ఇంతేనా అనిపించేలా అడుగడుగున జాలి చూపులు. అందరిలో సులభంగా కలిసిపోయి ఇమడలేని పరిస్థితి. అయినా సరే ఈ పరిస్థితిని ఏదో అనితర సాధ్యమైన విజయంతో సమాధానమిచ్చేలా తన తలరాతను తిరిగి రాయాలని సంకల్పించింది. ఆ నేపథ్యంలో ఆర్తి మొండి పట్టుదలతో ముందుకెళ్లెందేకు ప్రయత్నించింది.
అందుకు తండ్రి కల్నల్ రాజేంద్ర డోగ్రా, అమ్మ కుంకుమ్ డోగ్రా చక్కటి ప్రోద్భలం అందించారు. అయితే తన శారీరక ఎత్తు ఎగతాళి, అవమానాల తోపాటు తన కెరీర్ అవకాశాలను మింగేస్తోందని తెలిసి కుంగిపోలేదు. దానికే సవాలు విసిరేలా అందనంత అత్యున్నత స్థాయిలో ఉండాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. అలా ఆమె డెహ్రాడూన్‌లో పాఠశాల విద్యను, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని, మాస్తర్స్‌ని పూర్తి చేసింది.
చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థి అయిన ఆర్తి సివిల్స్ సర్వీస్‌ని ఎంపిక చేసుకుంది. అందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో అవమానాలు, అవహేళనలు తప్పలేదు. అయినా తన ప్రయత్నం తనదే..అన్నట్లుగా సాగింది. ఈ అమ్మాయా ఐఏఎస్ అయ్యింది అని విస్తుపోయేలా అనితరసాధ్యమైన విజయఢంకా మోగించింది. అత్యంత పొట్టి ఐఏఎస్‌గా చరిత్ర సృష్టించి..ఎందరో సివిల్స్ ఔత్సాహిక అభ్యుర్థులుకు స్ఫూర్తిగా నిలిచింది.
శారీరక లోపం అనేది మన అంతరంగంలో ఉన్న విశిష్ట శక్తిని మనకే పరిచయం చేసే సాధనంగా మలుచుకుంటే..సాధ్యం కాదనుకున్న విజయాలన్నీ ఒళ్లోకొచ్చి వాలిపోతాయంటోందామె. అంతేగాదు ఆ సక్సెస్ ఆమె శారీరక ఎత్తుని చూడనీయడం లేదు. ఈమె నాకు రోల్ మోడల్ అనిపించేలా ఆమె అత్యున్నత హోదా ప్రేరణ కలిగిస్తోంది. ఒక్క విజయంతో వేలెత్తి చూపే మాటలన్నింటికీ తగిన సమాధానం ఇవ్వడం అంటే ఇదే కదూ..!. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌లో సమాచార, సాంకేతిక కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
(చదవండి: హ్యక్ హా.. అప్‌డేట్ హా..?!)