
నా ఫోన్ హ్యాక్ అయిందా? అంటూ పలువురు మొబైల్ వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం కొన్ని ప్రముఖ బ్రాండ్ల మొబైల్స్‌లో వినియోగదారుల అనుమతి లేకుండానే ఆటోమెటిక్‌గా సెట్టింగ్స్ మారిపోవడమే. ఇదే అనేకమందిలో ‘మన ఫోన్లు హ్యాక్ అయ్యాయా?’ అనే ఆందోళనకు దారి తీస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అంతకు ముందు మనం మాట్లాడిన విషయాలు యాడ్స్, పోస్టుల రూపంలో కనిపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఈ రకమైన మార్పులు మరింత గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి సెట్టింగ్స్ మార్పులు హ్యాకింగ్ వల్ల మాత్రమే కాదని, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, కంపెనీ బగ్ ఫిక్స్‌లు లేదా డిఫాల్ట్ సిస్టమ్ సింక్ అయిన కారణంగా కూడా జరుగుతాయని సాంకేతిక నిపుణులు అంటున్నారు.
అవగాహన తోనే..
ఈ ఆటోమెటిక్ మొబైల్ సెట్టింగ్స్ మార్పు చూడడానికి చిన్నదిగా కనిపిస్తున్నా.. నగరవాసుల్లో ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనతో పాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెరగడానికి దోహదం చేసింది.
మన ప్రైవసీ, మన భద్రత, మన భవిష్యత్తును రక్షించుకోవడమేనని మరోసారి హెచ్చరించింది. కొన్ని సార్లు బ్రాండ్లు కొత్త ఫీచర్లను యూజర్లకు అందించడానికి ఆటోమెటిక్‌గా కొన్ని సెట్టింగ్స్ మార్చేస్తాయి. అయితే.. తమకు ముందస్తు నోటిఫికేషన్ రాకపోవడం వల్లే ఇది హ్యాకింగ్‌లా అనిపిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
లైఫ్ స్టైల్ మార్పులు..
నగరాల్లో జీవనశైలిలో ఉదయం అలారం మొదలు రాత్రి నిద్రపోయే వరకు.. చదువు, ఉద్యోగం, వినోదం, షాపింగ్ అన్నీ మొబైల్ ఆధారంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ సెట్టింగ్స్ ఇలా అనుకోకుండా మారిపోవడం నేరుగా వారి మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది.
ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రాజెక్ట్ వర్క్‌పై ఆధారపడిన మొబైల్ వినియోగదారులు ఈ సెట్టింగ్స్ మారడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఫియర్ ఆఫ్ హ్యాకింగ్ (ఫోన్ సురక్షితమా? అనే అనుమానం) వల్ల యువతలో ఆందోళన పెరుగుతుంది. డిజిటల్ చర్యలపై నమ్మకం తగ్గిపోవడం వల్ల సోషల్ మీడియా, ఆన్‌లైన్ లావాదేవీల పట్ల జాగ్రత్త పెరుగుతుంది. టెక్నాలజీపై ఆధారపడే జీవనశైలి మరింత సెక్యూరిటీ–సెంట్రిక్‌గా మారే అవకాశం ఉంది.
ఇలాంటివి కాకుండా ఉండాలంటే?
మొబైల్‌లోని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను మ్యాన్యువల్‌గా కంట్రోల్ చేయండి. ఆటోమేటిక్ అప్‌డేట్ ఆప్షన్‌ను ఆఫ్‌చేసి, అవసరం అనిపించినప్పుడు మాత్రమే అప్‌డేట్ చేయడం మంచిది.
ఎప్పటికప్పుడు యాప్‌లకు ఇచ్చే అనుమతులను జాగ్రత్తగా పరిశీలించండి. మైక్రోఫోన్, కెమెరా, లొకేషన్ యాక్సెస్ అవసరమైనప్పుడే ఆన్ చేయాలి, లేని పక్షంలో ఆఫ్‌లోనే ఉంచాలి.
టూ–ఫాక్టర్ అథెంటికేషన్ ఉపయోగించడం ద్వారా అకౌంట్‌లు మరింత సురక్షితంగా ఉంటాయి.
అనవసర యాప్‌లను తొలగించడం కూడా సెక్యూరిటీకి చాలా కీలకం.
సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో లాక్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటివి తప్పనిసరిగా ఉపయోగించాలి.
బ్యాకప్ సెట్టింగ్స్ తప్పనిసరి..
ఇలాంటి మార్పులు మళ్లీ జరగకుండా ఉండేందుకు మొబైల్‌లో సిస్టమ్ సెట్టింగ్స్ బ్యాకప్ తీసుకోవడం మంచిదని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సెట్టింగ్స్ మారితే తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే వై–ఫై లేదా డేటా నెట్‌వర్క్ ద్వారా జరిగే రిమోట్ మార్పులు నివారించడానికి ప్రైవసీ సెట్టింగ్స్ కఠినంగా ఉంచాలి.
(చదవండి: సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..)