
ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాల్లో ఆయనకు ఆయనే సాటి. ఆయనచెప్పే ఆర్థిక సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు గొప్పపాఠాలే కాదు శ్రీమంతులుగా మార్చే గొప్ప సూత్రాలు కూడా. ఆయన సంపదర పరంగానే కాదండోయ్ ఆరోగ్యపరంగానే బిలియనీరే. ఆయనేమి ఆరోగ్యానికి సంబంధించిన వాటిల్లోపెట్టుబడులు పెట్టలేదు గానీ వెల్‌నెస్ పరంగా ఆయన అలవాట్లు చూస్తే విస్తుపోతారు. అలాంటి ఆహారపు అలవాట్లు ఆయన దీర్ఘాయువు రహస్యమా అని విస్తుపోతారు. వైద్యులు, పరిశోధకులు నో అంటూ..మొత్తుకుని హెచ్చిరించి మరి చెప్పే వాటినే ఆయన ఇష్టంగా తింటాడట. అందరికీ అనారోగ్యకారకమైనవి మరి ఆయనకు ఎలా ఆరోగ్యకరంగా మారాయ్ అంటే..
తొంభైఐదు వసంతాలకు చేరువైన బఫెట్ 2015లో ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరేళ్ల పిల్లవాడిలా తింటానని ఎందుకంటే వాళ్లల్లో అత్యల్ప మరణ రేటు ఉంటుంది కాబట్టి అని చెప్పారు. ఈ డైలాగ్ నెట్టింట వైరల్‌గా మరి చాలామందిని ఆలోచింప చేసేలా చేసింది. అంతేగాదు ఆయన కేలరీలను లెక్కించడట. తాను అచ్చం చిన్నపిల్లవాడి మాదిరిగా తింటాను, నిద్రపోతానని అన్నారు.
కోకాకోలా అంటే బఫేట్‌కి మహాప్రీతి. ప్రతిరోజూ ఐదు నుంచి 12 ఔన్స్ డబ్బాలు అయిపోవాల్సిందేనట. తాను రోజుకి సుమారు 2,700 కేలరీలు తింటే..దానిలో పావువంతు కోకాకోలా ఉంటుందని ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అలాగే ఉదయం ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ డ్రింక్‌లు, సూపర్ ఫుడ్‌లు వంటివి ఏమి తీసుకోరు. ఆయన ప్రతిరోజూ మెక్‌డొనాల్డ్స్ మీల్స్ తింటాడు. ఫాస్ట్‌ఫుడ్‌నే అత్యంత ఇష్టంగా తింటారట. అంటే ఆయన తీసుకునే ఆహారంలో దాదాపు జంక్ ఫుడ్ అధికం.
నిజానికి వెల్నెస్ ప్రియులు దూరంగా ఉండే ఫుడ్‌నే ఆయన అత్యంత ఇష్టంగా తినడం విశేషం. తప్పనిసరిగా ఒక ఆదివారం ఐస్‌క్రీం తినాల్సిందేనట. అయితే బఫెట్ ఆరోగ్యపు అలవాట్లు ఆరోగ్యకరమైనవి కాకపోయినా..ఎంతటి బిజీ లైప్‌లో కూడా ఆయన ఎనిమిదింటికే నిద్రించడం, తెల్లవారుజామున నాలుగు గంటలకు వెళ్లడం, ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడమే ఇన్నేళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు కారణమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతేగాదు బఫెట్ తరుచుగా తనకు గాఢంగా నిద్రపోవడం అంటే అత్యంత ఇష్టమని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అలాగే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కూడా ఇలాంటి మంచి నిద్ర అలవాటు అనేది దీర్గాయువు సీక్రెట్‌కి సంబంధించిన వాటిల్లో ఒకటని పేర్కొంది. అంతేగాదు వయసు పెరుగుతున్న..అంతరంగంలో పసిబిడ్డలాంటి ఉత్సుకత కలిగిన మనసుని మర్చిపోవద్దని చెబుతుంటారు. అంటే మనకు ఇష్టమైన వాటిని వెంటనే ఆస్వాదించే చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదులుకోవద్దని చెబుతుంటారు.
ఇప్పటికీ ఆయన తన స్నేహితులతో బ్రిడ్జ్ వంటి ఆటలను ఆస్వాదిస్తారట. అది తన మెదడుకు మేధోపరమైన వ్యాయామం అని చెబుతున్నారాయన. అలాగే తన షెడ్యూల్‌లో ఖాళీ అనే పదానికి అస్సలు అవకాశం ఉండదట. అలా తన సమయాన్ని వృద్ధా చేయకుండా సద్వినియోగం చేసుకోగలనని అన్నారు. ఇక తనకు రోజులో కనీసం ఐదు నుంచి ఆరుగంటలు చదవడం, ఆలోచించడం వంటి వాటితో గుడుపుతాడట.
ముఖ్యంగా వ్యాపారం లేదా పెట్టుబడి గురించి ఆలోచించడం వంటి వాటిపట్ల మిక్కిలి ఆనందదాయకంగా ఉంటుందట. అంటే మనం చేస్తున్న పనిని ప్రేమించడం, ఇష్టపూర్వకంగా పనిచేయంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తే..భారం అనే పదకు ఆస్కారం ఉండదంటారు బఫేట్. అలాగే వారంలో మూడు రోజులు వ్యాయమాలు చేస్తానని చెప్పారు. ఇక ధూమపానం, మద్యపానం వంటి వాటి జోలికి అస్సలు పోనని చెబుతున్నారు.
అంతేగాదు బఫేట్ ఎలాంటి కఠినమైన డైట్‌లు అనుసరించనని..నచ్చిన ఫుడ్‌ని సంతోషభరితంగా ఆస్వాదించడం..తన శరీరం ఇష్టపడే వాటిని మితంగా ఆస్వాదించేలా నియంత్రించుకోగల సామర్థ్యం వంటివే తన ఆరోగ్య రహస్యమని నవ్వుతూ చెబుతున్నారు బఫెట్. పోషకాహార నిపుణులు చెప్పే చెడు ఆహారపు అలవాట్లే బఫేట్‌వి అయినా..ఆయన మంచి నిద్రకు, శారీరక శ్రమకు మద్దతిస్తూ..చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడిందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: హృదయం విరిగితే అతికించలేం గానీ నయం చేయొచ్చు..!)