వాట్సాప్‌ గ్రూపులే టార్గెట్‌! | Cybercriminals doing bulk hacking | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ గ్రూపులే టార్గెట్‌!

Sep 10 2025 5:06 AM | Updated on Sep 10 2025 5:07 AM

Cybercriminals doing bulk hacking

ఓ ఏసీపీ ఇటీవల పెట్టుకున్న స్టేటస్‌

బల్క్‌ హ్యాకింగ్‌ చేస్తున్నసైబర్‌ నేరగాళ్లు  

ఓటీపీలు సంగ్రహించి,ఏపీకే ఫైల్స్‌ పంపుతూ హ్యాక్‌  

బాధితుల జాబితాలో పోలీసు అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: కంటికి కనిపించకుండా ఆన్‌లైన్‌లో ఎర వేసి అందినకాడికి దోచుకునే సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటున్నారు. ఈ–కేటుగాళ్లు తాజా గా వేస్తున్న ఎత్తు వాట్సాప్‌ బల్క్‌ హ్యాకింగ్‌. తొలుత ఓ ఫోన్‌ను హ్యాక్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. ఆ నంబర్‌ ఉన్న వాట్సాప్‌ గ్రూపు ల్ని టార్గెట్‌ చేస్తున్నారు. 

ఆ నంబర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ప్యాకేజ్‌ కిట్‌ (ఏపీకే) ఫైల్స్‌ను వాట్సాప్‌ గ్రూపుల్లోకి పంపి పెద్ద ఎత్తున నంబర్లను హ్యాక్‌ చేస్తున్నారు. ఈ నేరాల బాధితుల్లో పోలీసులు సైతం ఉండటం గమనార్హం. గడిచిన పక్షం రోజుల్లో కర్నూలు జిల్లాకు చెందిన ఓ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై), హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పని చేసే అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు (ఏసీపీ) కూడా బాధితులుగా మారారు. 

అధికారిక వెబ్‌సైట్ల నుంచి వివరాలు 
ఈ రకమైన నేరాల కోసం సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా వాట్సాప్‌ గ్రూపులను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. పోలీసు సహా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఇటీవల ఇలాంటి గ్రూపులు నిర్వహించడం అనివార్యంగా మారింది. దీంతో అధికారుల నంబర్లను అధికారిక వెబ్‌సైట్ల నుంచే సంగ్రహించి ముందుగా వారి ఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారు. తొలుత తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని యాక్టివేట్‌ చేసేందుకు వెబ్‌సైట్‌ నుంచి సేకరించిన అధికారి నంబర్‌ను వాడుతున్నారు. ఆ నంబర్‌కు వచ్చే ఓటీపీ కోసం కట్టుకథలు అల్లుతున్నారు. 

తాము ఓ సైట్‌ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పొరపాటున మీ నంబర్‌ ఎంటర్‌ చేశామని, ఫలితంగా ఓటీపీ మీకు వచ్చిందని, దయచేసి చెప్తే తన పని పూర్తవుతుందని నమ్మబలుకుతున్నారు. ఇందులో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేకపోవడంతో తేలిగ్గా నమ్ముతున్న బాధితులు.. ఆ ఓటీపీ చెప్తున్నారు. ఆ నంబర్‌తో సైబర్‌ నేరగాళ్లు అప్పటికే సిద్ధం చేసుకున్న వాట్సా ప్‌ యాప్‌ను యాక్టివేట్‌ చేయగానే.. బాధితుడి నంబర్‌తో పనిచేసే వాట్సాప్‌ వారి ఫోన్‌ నుంచి సైబర్‌ నేరగాడి ఫోన్‌లో యాక్టి వేట్‌ అయిపోతోంది. ఆ వెంటనే వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘టూ స్టెప్‌ వెరిఫికేషన్‌’కు మార్చేస్తున్నారు. 

ఆపై బ్యాకప్‌ నుంచి కాంటాక్ట్స్, గ్రూపులు, ఇతర వివరాలు డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆ గ్రూపుల్లో సదరు అధికారి మాదిరిగా సందేశం పెడుతూ.. ఏపీకే ఫైల్స్‌ తో కూడిన లింకులు పంపిస్తున్నారు. ఈ సందేశం సదరు అధికారి నుంచే వచ్చినట్లు భావిస్తున్న గ్రూపు సభ్యులు క్లిక్‌ చేయడంతో ఏపీకే ఫైల్స్‌ వారి ఫోన్లలోకి చొరబడి, అవీ హ్యాక్‌ అయిపోతున్నాయి. ఈలోపే తమ ఫోన్‌లో వాట్సాప్‌ పని చేయట్లేదని గుర్తించి న సదరు అధికారి.. ఆ యాప్‌ను డిలీట్‌ చేసి మరోసారి ఇన్‌స్టాల్‌ చేసి యాక్టివేట్‌ చేయ డానికి ప్రయత్నించినా ఫలితం దక్కట్లేదు.  

ఈ జాగ్రత్తలు అవసరం 
వాట్సాప్‌ హ్యాకింగ్‌ బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు మూడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నా రు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అందులో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆ నంబర్‌తో కూడిన వాట్సాప్‌ను మరోసారి, మరో ఫోన్‌లో యాక్టివేట్‌ చేయాలంటే... ఓటీపీతో పాటు యాక్టివేషన్‌ కోడ్‌ కూడా అవసరం అవుతుంది. అపరిచితుల, సుపరిచితుల నంబర్ల నుంచి వచ్చే లింకుల్లో ఏపీకే అనే ఫైల్‌ ఉంటే దాన్ని వెంటనే డిలీట్‌ చేయాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement