
ఉపకరణాల్లో సింహభాగం వీటిదే
ఐదింట ఒక వంతు గృహోపకరణాలది
ఎల్రక్టానిక్స్‌లో మొబైల్ ఫోన్లదే అధిక భాగం
మొబైల్ ఫోన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ.. ఇలా ఏదో ఒకటి లేని ఇల్లు అంటూ ఉండదు. ఇవి మన జీవితంలో అంతలా భాగమయ్యాయి. దేశంలో ఉపకరణాలు, ఎల్రక్టానిక్స్ రంగంలో బిజినెస్ టు కన్జ్యూమర్ (బీ2సీ) విభాగం వాటా 90 శాతానికి పైగా ఉంది. విలువ రూ.5.9 లక్షల కోట్లు. 2029 నాటికి బీ2సీ విభాగం రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా అంచనా వేస్తోంది.

ఉపకరణాల రంగంలో గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్‌గా రెండు ప్రధాన విభాగాలున్నాయి. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ మార్కెట్‌లో మొబైల్ ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ కండిషనర్స్ సెగ్మెంట్ రాబోయే నాలుగేళ్లలో రెండు రెట్లు అధికమై 17 శాతం వృద్ధి చెందుతుందని ఎల్‌జీ భావిస్తోంది. ఐపీఓ పత్రాల్లో కంపెనీ భారత మార్కెట్ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించింది.