
సరదాగా ఉరి చిత్రీకరిస్తుండగా ప్రమాదం
కుర్చీపైనుంచి కాలుజారి బిగిసిన ఉరి
పద్నాలుగేళ్ల బాలునికి నూరేళ్లు
న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని శాంతి నగర్, ఆ రోజు అక్టోబర్ 12. ఆ మధ్య తరగతి కుటుంబంలో ఎప్పుడూ ఉండే ఆనందం, నవ్వులు.. ఆరోజు భయంకరమైన నిశ్శ బ్దంలో కొట్టుకుపోయాయి. తండ్రి ఒక రియల్ ఎస్టేట్ డీలర్, తల్లి గృహిణి, 12వ తరగతి చదువుతున్న కుమార్తె, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు.. ఇంతే ఆ కుటుంబం. పద్నాలుగేళ్ల ఆ బాలునికి ఈ తరం పిల్లల్లాగే సోషల్ మీడియాపై ఆసక్తి ఉంది.
తన గదిలోనే ఏదో కొత్త వీడియో తీయాలనే ఉత్సాహంతో ఉన్నా డు. అప్పుడు తెలియదు, ఆ ఉత్సాహమే తన జీవితంలో చివరి క్షణం అవుతుందని.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని వేళ, తన గదిని ఓ చిన్న స్టూడియోలా మార్చుకున్నాడు. మొబైల్ ఫోన్‌ను ఒక చోట పెట్టి, ’ఆత్మహత్యను అనుకరించే’ దృశ్యాన్ని రికార్డు చేయడం మొదలు పెట్టాడు. తెరపై చూపించే ఉత్కంఠను తానూ అనుభూతి చెందాలనుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నంలో, బాలుడు నిల్చున్న కుర్చీపై నుంచి కాలు జారింది. అంతే.. క్షణాల వ్యవధిలో అంతా మారిపోయింది.
బాలుడికి ఊపిరి అందలేదు. కొద్దిసేపటి తరువాత, తల్లిదండ్రులు గదిలోకి వచ్చి చూడగానే.. వారి గుండెలు బద్దలయ్యా యి. ఆందోళనతో వెంటనే దగ్గర్లోని ఆసు పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ సంఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఆ బాలుడు వీడియో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి ఉండవచ్చు. వీడియో ఫుటేజీ లోని బాలుని హావభావాలు చూస్తే అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది’.. అని పేర్కొన్నారు. బీజేఆర్‌ఎం ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి బాలుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమా దవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు.