
అనంత చతుర్దశికి ఒక విశేషం వుంది. ఆ రోజు నాడే శ్రీ వినాయకుడిని నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఆయనను ప్రతిష్టించి పది రోజులు పూజలు జరుపుకున్న తరువాత మట్టితో చేసిన ఆయన ప్రతిమను నదిలో గానీ, సముద్రంలో గానీ కలపడానికి కారణం అలా పూజలందుకున్న వినాయకునికున్న శక్తులు ఆ నీటి ప్రవాహం ద్వారా సర్వత్రా వ్యాప్తి చెందుతాయని, ఆ విధంగా శ్రీ గణేశుని శక్తులు, తత్వమయిన పవిత్రత, వివేకం, అబోధితత్వం, విచక్షణ, తల్లిపట్ల సమర్పణా భావం ఆ అనంతమైన నీటిలో స్థిరపడి ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుకుంటాయి. అనంత అంటేనే శ్రీ వినాయకుడు. అనంత అంటే నాశనం లేనివాడు. అనంతగా వ్యాపించి వున్న గణేశశక్తి.
అంతటి మహత్తు, మహిమాన్వితుడిని నిమజ్జనానికి తీసుకెళుతున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్దలతో, మేళ తాళాలతో, మంగళ ప్రదమైన గణేశ్ కీర్తనలతో సాగనంపాలి. ఆయన జన్మించిన భాద్రపద శుక్ల చవితి నాడు ఆయనను ప్రతిష్టించి, ఆ తరువాత పదవ రోజున, అంటే అనంత చతుర్దశి నాడు సముద్రంలో నిమజ్జనం చేయడానికున్న ప్రాముఖ్యత అటువంటిది.
మట్టినుంచి ఉద్భవించిన గణేశుడు నీటిలోకి చేరి తద్వారా మానవాళికి, జంతువులకు, ప్రకృతికి తన శక్తులను, తత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత నిమజ్జనం కార్యక్రమాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పుణ్యకార్యంగా జరుపుకోవాలి తప్పించి అశ్లీలతకు, నిందారోపణలకు, ఘర్షణలకు దారితీసే వాతావరణంలో కాదు.
– డా. పి.రాకేశ్
(పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాలు ఆధారంగా)