సాంఘీక నృత్యం కోలాటం.. | Ganesh Navratri 2025: Kolatam Revives Tradition with Modern Touch in Hyderabad | Sakshi
Sakshi News home page

నవరాత్రుల వేళ..సాంస్కృతిక సందడి..

Sep 1 2025 12:15 PM | Updated on Sep 1 2025 12:22 PM

Ganesh Visarjan: Kolatam preparations to bid farewell to Lord Ganesha

కోల అంటే కర్రపుల్ల.. ఆట అంటే నృత్యం.. ఈ రెంటినీ కిలిపేదే కోలాటం.. పల్లె, పట్టణంలో చిన్నా పెద్దా భేదం లేకుండా పండుగవేళ సరదాగా ఆడే సాంఘిక నృత్యమే కోలాటం. ఈ నృత్య సంప్రదాయం నేడు ఆధునిక పద్ధతులతో మరింత అబ్బురపరుస్తుంది. నవరాత్రుల్లో అందరినీ ఆకట్టుకునే నృత్యంగా గుర్తింపు తెచ్చుకుంది. మహిళలంతా ఒకే రంగు దుస్తుల్లో గుండ్రంగా తిరుగుతూ కోలాటం ఆడుతుంటే ఆ జోష్‌ మాటల్లో చెప్పలేం..నగరంలో గణనాథుని ఉత్సవాల నేపథ్యంలో ఇప్పటికే కోలాటాల సందడి షురూ అయ్యింది. సందర్భాన్నిబట్టి బాణీలు కట్టే ఈ సంప్రదాయ కళ.. నేడు ఆధ్యాత్మికతకు సంస్కృతిని జోడించి మరింత ఆకర్షణీయంగా అలరిస్తుంది. 

డ్రెస్‌ కోడ్‌తో మరింత శోభ..
కోర్‌ సిటీ, శివారు ప్రాంతం అని తేడా లేకుండా కోలలు మార్మోగుతున్నాయి. గణేశుని శోభాయాత్రలో ముందువరుసలో మహిళలు కోలాటం ఆడుతూ ఊరేగింపుకు ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇందుకోసం మహిళలందరూ డ్రెస్‌కోడ్‌ పాటిస్తున్నారు. అప్పుడే ఆ కళకు మరింత వన్నె తీసుకురావచ్చని భావిస్తున్నారు. దీని కోసం ఆయా గ్రూపుల వారు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ఆకర్షణీయమైన వ్రస్తాలను ఎంచుకుంటున్నారు. వనితలు తాండవం ఆడుతూ తమ చేతుల్లోని రెండు కర్రలు కలుపుతూ చేసే ధ్వనులు వీక్షకులకు వీనుల విందు మాత్రమే కాదు.. ఆ కళారూపం నయనానందకరం. 

గణేశ నవరాత్రులు వచ్చాయంటే గల్లీగల్లీలోనూ సందడే.. మండపం తీర్చిదిద్దే దగ్గర నుంచి నిమజ్జన ఊరేగింపు వరకూ ఎందులోనూ రాజీపడకుండా ఉత్సవ నిర్వాహకుల మధ్య ఆధ్యాతి్మక పోటీ నెలకొనడం సహజమే. పాడ్‌బ్యాండ్, తీన్మార్‌ స్టెప్పులు, కళాకారుల వేషధారణలతో గణపయ్యను సాగనంపుతారు. అయితే గత కొన్నేళ్లుగా సంప్రదాయ కోలాట సందడి నగరంలో జోరుగా కనిపిస్తోంది. దీనికి ఆధ్యాతి్మకతను మిళితం చేసి మానసికోల్లాసాన్ని అందించే కోలాటం కళలో శిక్షణకు ఎంతైనా ఖర్చు చేసేందుకు మహిళలు వెనుకాడడం లేదు. 

కాలనీల్లో బృందాలుగా.. 
గతంలో ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి నృత్యాలు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో నగరంలోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో, కాలనీల్లో అక్కడి మహిళలే బృందాలుగా ఏర్పడి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ పొందుతున్నారు. తమ వినాయకుడి వద్ద తామే కోలాటం ప్రదర్శించేందుకు చిన్నారులు, మహిళలు ఉత్సాహం కనబరుస్తున్నారు. 

ఇందుకోసం నేర్పే గురువుల టైమ్‌స్లాట్స్‌ దొరకడంలేదంటే అతిశయోక్తి కాదు. నిజాంపేట ప్రాంతానికి చెందిన ఓ గురువు ఉదయం 5.30 గంటలకు కోలాట శిక్షణ తరగతులు ప్రారంభిస్తే అర్ధరాత్రి 12 గంటల వరకు 12 మండపాల వరకూ మహిళలకు శిక్షణ ఇస్తూనే ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. టైమ్‌ స్లాట్స్‌ కుదరక కొన్నిచోట్లకు అసిస్టెంట్స్‌ను పంపిస్తున్నారు. నిమజ్జన శోభాయాత్ర కోసం వేల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. 

పలువురికి హాబీగా.. 
కేవలం ఉత్సవ వేళ మాత్రమే నేర్చుకుని వదిలేయడం కాకుండా.. దీనిని ఓ హాబీగా మార్చుకుని కోలాటం వేస్తున్నారు. తద్వారా కాలనీలో జరిగే దసరా, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఉగాది, న్యూయర్‌.. ఇలా ప్రతి ఈవెంట్‌లో కోలాటానికి షెడ్యూల్‌ ఉండాల్సిందే. ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీలు కోలాట సంస్కృతికి ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. 

దీనికి తోడు కోలాటంలో ఆధ్యాత్మికత, మానసిక దృఢత్వం, ఫిట్‌నెస్‌ అంశాలు మిళితమై ఉన్నాయి. దీంతో మహిళల చేతుల్లోని కర్రలను లయబద్దంగా ఆడించడానికి ఎంతో ఏకాగ్రత అవసరం. తద్వారా చిన్నారులకు ఏకాగ్రత కూడా పెరుగుతుందని పలువురు భావిస్తుండడం విశేషం. అంతేకాకుండా పొరుగువారితో స్నేహం కూడా పెంపొందుతుందని వీరు నమ్ముతున్నారు.   
కోలాటం నేర్చుకోవాలనే తాపత్రయం పెరిగింది

నేను సిటీకి వచ్చి ఏడేళ్లు. అప్పటి నుంచి కోలాటం నేర్పుతున్నాను. అప్పట్లో ఆదరణ అంతంతమాత్రంగా ఉండేది. రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా అడపా దడపా వినాయక మండపాల వద్ద నేర్చుకునేందుకు ముందుకువచ్చేవారు. కానీ ఇప్పుడు కోలాటం నేర్చుకోవాలనే తాపత్రయం పెరిగింది. ఇప్పుడు తాను ఉదయం 5.30 గంటలకు శిక్షణ మొదలుపెడితే అర్ధరాత్రి 12 గంటల వరకు నేర్పుతున్నాను. నాకు సమయం లేక మరికొంతమంది వద్దకు నా అసిస్టెంట్‌ను పంపిస్తూ నేర్పిస్తున్నాను. ఫిట్‌నెస్‌ కూడా కోలాటం ఎంతగానో దోహదం చేస్తుంది. 
– సాయిగణేశ్‌ కోలాటం మాస్టర్‌

ఐక్యత పెరిగేందుకు.. 
మాది కొత్తగా ఏర్పడిన గేటెడ్‌ కమ్యూనిటీ. సభ్యుల మధ్య పరిచయాలు, ఐక్యత పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. కొందరు ప్రత్యేకంగా గ్రూప్‌ క్రియేట్‌ చేసుకుని కోలాటం నేర్చుకుంటున్నారు. మా ప్రయత్నం ఫలించింది. దీనిని కమ్యూనిటీలోని ప్రతి కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నాం. 
– రావూరి శ్రీవాణి, గోథిక్‌ పెంటగాన్‌ క్లౌడ్స్‌ (గేటెడ్‌ కమ్యూనిటీ) 

ఫిట్‌నెస్‌పరంగానూ ఉపయోగం.. 
కోలాటం కేవలం ఒక వినోదాత్మక కళ మాత్రమే కాదు.. శారీరక, మానసిక దృఢత్వానికి కీలకం. 1300 ఫ్లాట్లు కలిగిన మా కమ్యూనిటీలో శ్రీరామనవమి, కృష్ణాష్టమి, గణపతి నవరాత్రులు ఇలా ఏ పండుగ వచ్చినా కోలాట ప్రదర్శన తప్పనిసరి. మాస్టర్స్‌ వద్ద మా సభ్యులు మెళకువలు నేర్చుకుంటున్నారు. మహిళల మధ్య బంధం బలపడుతోంది. 
– దీప్తి, బ్రిగేడ్‌ సిటాడెల్‌ హైరైజ్‌ 

అపార్ట్‌మెంట్‌ చిన్నారుల ఉత్సాహం..
కాలనీలో ఎప్పటి నుంచో చిన్నారులు ఉత్సాహంగా కోలాటం నేర్చుకుంటున్నారు. గణపతి నిమజ్జన ఊరేగింపులో అందరూ ఒకేరకమైన డ్రెస్‌ ధరించడం శోభాయాత్రకే ప్రత్యేక ఆకర్షణ. కోలాటం శిక్షణను ఇక మీదట కూడా కొనసాగిస్తాం. దీని ద్వారా పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. 
– బుచ్చిబాబు, మోడల్‌కాలనీ ప్రధాన కార్యదర్శి  

(చదవండి: ల్యాబ్‌ మేడ్‌ ఫిష్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement