
ఒకప్పుడు చేపల కోసం సముద్రంలోకి వల వేసేవారు. ఇప్పుడు ల్యాబ్‌లో ‘సెల్’ వేస్తున్నారు. అది కూడా ఎంతో రుచికరమైన సాల్మన్ ఫిష్ కోసం. తాజాగా అమెరికాలో ల్యాబ్ గ్రోన్ సీ ఫుడ్‌కి ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్‌డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, త్వరలోనే ఈ చేప వంటకాలు డైనింగ్ టేబుల్ మీదకు రావడమే తరువాయి. ‘వైల్డ్‌టైప్’ అనే సంస్థ 2018లో కోహో సాల్మన్ కణజాలంతో ఈ కృత్రిమ చేప మాంసం తయారీని మొదలు పెట్టింది.
దానికి స్పెషల్ డైట్, ప్రొటీన్ షేక్స్, పక్కా బయో రియాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి, చేపను పెద్దదిగా తయారు చేస్తారు. ఇది జీవహింస లేని పద్ధతి, పైగా ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు తక్కువగా కూడా ఉండటంతో, చాలామంది పర్యావరణ ప్రేమికులు ‘ఇంకాస్త పరిశోధన కావాలి కానీ ఐడియా సూపర్!’ అంటున్నారు.
ఈ మధ్యనే ఇలా తయారు చేసిన చేప మాంసంతోనే, ఒక రెస్టరెంట్‌లో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ‘ఏం తేడా లేదు, సూపర్‌గా ఉంది’ అని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది రకరకాల అనుమానాలతో ‘ల్యాబ్ ఫుడ్? నో థ్యాంక్స్’ అనేస్తున్నారు. ఇది చూస్తుంటే, రేపటికి ల్యాబ్‌లే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తయారయ్యే కిచెన్‌లుగా మారిపోతాయని కనిపిస్తోంది.
కంటి శుక్లాలకు చుక్కల మందు
నడి వయసు దాటిన వారిలో చాలామందికి కళ్లలో శుక్లాలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవడానికి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న మార్గం శస్త్రచికిత్స మాత్రమే! అయితే, ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు కంటి శుక్లాలను పూర్తిగా నయం చేయగల చుక్కల మందును సృష్టించారు.
యూనివర్సిటీ ఆఫ్ శాన్‌ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లకు చెందిన శాస్త్రవేత్తలు కంటి శుక్లాలను కరిగించగల చుక్కల మందును విజయవంతంగా తయారు చేయగలిగారు. ‘లానోస్టెరాల్’ అనే ఔషధ రసాయనంతో కూడిన ఈ చుక్కల మందు త్వరలోనే కేటరాక్ట్ సర్జరీకి ప్రత్యామ్నాయం కాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వయసు మళ్లిన వారిలో అంధత్వానికి కేటరాక్ట్ ప్రధాన కారణంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతున్న నేపథ్యంలో ఈ చుక్కల మందు వైద్యరంగానికి ఆశాకిరణంగా మారింది.
(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!)