
జోర్డాన్‌లోని పెట్రా నగరం– పర్యాటకుల్ని ఆకర్షించే పురాతన, చారిత్రక ప్రాంతం! దీనిని నబేటియన్ తెగవారు సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ నగరం మొత్తం ఎర్రటి ఇసుకరాతి పర్వతాలను తొలిచి నిర్మించడంతో ఈ ప్రదేశమంతా చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. పెట్రా ప్రధాన మార్గంలో ఉండే ‘అల్–ఖజ్నే’ అనేది ఇక్కడున్న అతిపెద్ద కట్టడాల్లో ఒకటి.
ఇక్కడున్న సిక్ అనే పొడవైన, ఇరుకైన లోయ గుండా వెళితేనే పెట్రా నగరంలోకి ప్రవేశించగలం. అలాగే ఇక్కడ కొన్ని భారీ రాతి సమాధులు ఉంటాయి. వాటిని ‘రాయల్ టూంబ్స్’ అంటారు. అవి నబేటియన్ల కళా నైపుణ్యానికి నిదర్శనం. భూకంపాలు, వర్తక మార్గాల మార్పులతో ఈ నగరం దాదాపు వెయ్యి సంవత్సరాలు మరుగునపడింది. తిరిగి 1812లో దీనిని కనుగొన్నారు. ఈ అద్భుతమైన నగరం ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
ప్రతిభకు సంబరాలు!
హెల్సింకీ ఫెస్టివల్ – ఇది ఫిలండ్‌లోని అతిపెద్ద మల్టీ–ఆర్ట్ ఫెస్టివల్! ఇది హెల్సింకీ నగరంలో జరుగుతుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలను సెప్టెంబర్ 1 వరకు నిర్వహిస్తారు. ఈ ఫెస్టివల్‌లో సంగీతం, డ్యాన్స్, విజువల్ ఆర్ట్స్, సినిమా వంటి వివిధ కళా రూపాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశీయ, అంతర్జాతీయ కళాకారులను, ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఈ ఫెస్టివల్‌లో ప్రతి ఒక్కరికీ నచ్చేలా అనేక కార్యక్రమాలు ఉంటాయి. క్లాసికల్ సంగీతం దగ్గర నుంచి పాప్, రాక్ వంటి ఆధునిక సంగీతం వరకు వివిధ శైలులలో ప్రదర్శనలు జరుగుతాయి.
అంతర్జాతీయంగా పేరు పొందిన ప్రముఖ బ్యాండ్‌లు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటాయి. థియేటర్ ప్రదర్శనలు, నత్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతర్జాతీయ బందాలు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తాయి. ఫెస్టివల్‌లో భాగంగా నగరంలోని వివిధ గ్యాలరీలలో విజువల్ ఆర్ట్స్ ప్రదర్శనలు జరుగుతాయి. ఇది స్థానిక, అంతర్జాతీయ కళాకారులకు తమ సజనాత్మకతను ప్రదర్శించడానికి మంచి అవకాశం.
ఓపెన్–ఎయిర్ సినిమా ప్రదర్శనలు, సాహిత్యం ఈ ఫెస్టివల్‌లో భాగంగా ఉంటాయి. హెల్సింకీ ఫెస్టివల్‌లో అత్యంత ముఖ్యమైన, విశేషమైన భాగం నైట్ ఆఫ్ ది ఆర్ట్స్. ఇది ఈ పదిహేను రోజుల్లో ఒకే రోజు జరుగుతుంది. ఆ రోజున హెల్సింకీ నగరం కళల వెలుగులతో నిండిపోతుంది. మ్యూజియమ్‌లు, గ్యాలరీలు, థియేటర్లు, బుక్‌షాప్‌లు రాత్రి పొడవునా తెరిచి ఉంటాయి. ప్రజలు వీథుల్లో కళా ప్రదర్శనలను, ప్రత్యక్ష సంగీత కచేరీలను ఉచితంగా ఆస్వాదిస్తారు.
(చదవండి: స్క్రీన్ అడిక్షన్ హద్దుల్లేకుంటే ఇక్కట్లు తప్పవు)