
హైదరాబాద్‌కు చెందిన సునీత తన పన్నెండేళ్ల కొడుకుని కౌన్సెలింగ్ కోసం తీసుకువచ్చింది. కారణం స్మార్ట్ ఫోన్ అడిక్షన్. రోజుకు ఏడెనిమిది గంటలు ఫోన్‌లోనే గడిపేస్తున్నాడు. వద్దని ఫోన్ లాగేసుకుంటే తల్లిపైనే దాడి చేశాడు. పరిస్థితి చేయిదాటిపోయిందని గ్రహించిన ఆమె కొడుకును కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చింది. ఆరు వారాల కౌన్సెలింగ్ తర్వాత స్క్రీన్ టైమ్ ఏడు గంటల నుండి గంటన్నరకు తగ్గింది.
ఇది సునీత ఒక్కరి సమస్య కాదు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇదే సమస్య. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, వీడియో గేమ్స్ పిల్లల జీవితంలో ఒక భాగమయ్యాయి. అవి లేకుండా గడపలేని పరిస్థితికి వచ్చారు. ఈ తరం విద్యార్థులు రోజుకు 6–8 గంటలు స్మార్ట్‌ఫోన్‌లోనే గడిపేస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఇది ప్రమాదకర స్థాయి. దీనిపై స్పందించకపోతే మీ బిడ్డ జీవితాన్ని స్మార్ట్‌ఫోన్ లాగేసుకుంటుంది. అందుకే తల్లిదండ్రులు తక్షణమే స్పందించి స్క్రీన్ టైమ్ కంట్రోల్ చేయాలి, బౌండరీస్ ఏర్పాటు చేయాలి.
హద్దులు ఏర్పరచడమెలా?
1. పిల్లలు చూసి నేర్చుకుంటారు. మీరు టీవీ, ఫోన్ చూస్తూ కూర్చుంటే, వాళ్లు కూడా అదే చేస్తారు. అందుకే మీరో రోల్ మోడల్ అవ్వండి. ఫ్యామిలీ స్క్రీన్–ఫ్రీ టైమ్ డిక్లేర్ చేయండి. ఉదాహరణకు, డిన్నర్ టైమ్‌లో అన్ని డివైసెస్ ఆఫ్ చేయాలనేది అమలు చేయండి.
2. పిల్లల బ్రెయిన్ కంట్రోల్‌కు లొంగదు. కాని, వాళ్లను చర్చలో భాగం చేస్తే కంట్రోల్ చేసుకుంటారు. అందుకే వాళ్లతో కూర్చొని స్క్రీన్ టైమ్ కాంట్రాక్ట్ చేసుకోండి. ఉదాహరణకు, హోంవర్క్ పూర్తయ్యాక మాత్రమే 45 నిమిషాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్ వాడాలని అగ్రిమెంట్ చేసుకోవడం.
3. ఫోన్ తీసేసి ఖాళీగా వదిలేస్తే, ఆ ఖాళీ సమయం మళ్లీ మొబైల్ వైపు లాగేస్తుంది. అందుకే ఆ సమయాన్ని మ్యూజిక్, బోర్డ్ గేమ్స్, క్రాఫ్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్‌తో భర్తీ చేయాలి. ఇవి ‘న్యూరల్ రివార్డ్’ ఇస్తాయి.
4. ఇంట్లో కొన్ని జీరో–స్క్రీన్ జోన్స్ క్రియేట్ చేయండి. ఉదాహరణకు, బెడ్రూమ్, డైనింగ్ హాల్, ఫ్యామిలీ హాల్‌లో ఫోన్ వాడకపోవడం. అలాగే ఫోన్ చార్జింగ్ బెడ్ రూమ్‌లో పెట్టవద్దు.
5. ఫోన్ వాడొద్దని పిల్లలకు నేరుగా చెప్పినా, బలవంతంగా లాక్కున్నా రెబెల్ అవుతారు. దానికి బదులుగా ‘‘స్క్రీన్ వల్ల నీ ఫోకస్ తగ్గుతుంది, ఐక్యూ తగ్గుతుంది, నిద్ర దెబ్బతింటుంది’’ అని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పండి. కారణం అర్థం చేసుకున్న పిల్లలు కోఆపరేట్ చేస్తారు.
సైన్స్ ఏమంటోంది?
ప్రస్తుత ఏఐ యుగంలో మార్కుల కన్నా ఫోకస్, ఇమేజినేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గెలిపిస్తాయి. కాని, వీటిని స్క్రీన్ అడిక్షన్ దెబ్బతీస్తుంది.
ఫోన్‌లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ మెదడులో ఆనందాన్నిచ్చే డోపమైన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఆ తర్వాత సాధారణ పాఠాలు, ఫ్యామిలీ టైమ్ బోరింగ్‌గా అనిపిస్తాయి.
రోజుకు ఆరు గంటలు మొబైల్ గేమ్స్ ఆడిన టీనేజర్ మెదడులో నిర్ణయాలు, ఫోకస్‌కు అవసరమైన గ్రే మేటర్ తగ్గినట్లు ఎంఆర్‌ఐ స్కాన్లు చూపించాయి.
స్క్రీన్ లైట్ వల్ల మెలటోనిన్ తగ్గుతుంది. దీనివల్ల నిద్ర దెబ్బతింటుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ఎంత సమయం చూడొచ్చు?
రెండేళ్ల లోపు పిల్లలకు అస్సలు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకూడదు.
రెండు నుంచి ఐదేళ్ల వయసు పిల్లలకు రోజుకు గంట మించకూడదు.
6–12 ఏళ్ల పిల్లలకు రోజుకు రెండు గంటలు మించకూడదు.
13 ఏళ్లు పైబడిన వారు రెండు గంటలకు పైబడి వాడవచ్చు.
స్క్రీన్ టైమ్ అతిగా ఉంటే...
నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, సామాజిక భయం వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చు.
కంటి సమస్యలు, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినవచ్చు.
ఏకాగ్రతలో ఇబ్బందులు, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం కష్టం కావడం వంటి అభివృద్ధిపరమైన సమస్యలు.
తల్లిదండ్రులు చేసే తప్పులు
పిల్లల ఫోన్ రహస్యంగా చెక్ చేయడం వల్ల పిల్లలు వారిపై నమ్మకం కోల్పోతారు.
ఏడాదంతా మౌనంగా ఉండి పరీక్షల కాలంలో మాత్రమే నిబంధనలు పెట్టడం వల్ల ప్యాటర్న్ సెట్ కాదు.
తల్లిదండ్రులు రోజంతా స్మార్ట్ ఫోన్ చూస్తూ పిల్లలను కంట్రోల్ చేయడం హిపోక్రసీ, దీనివల్ల పిల్లలు ఎదురు తిరుగుతారు.
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com