
ఈ నెల 21 నుంచి కౌన్సెలింగ్: ఎంసీసీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారైంది. నీట్ యూజీ–2025 కౌన్సెలింగ్ ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) శనివారం ప్రకటించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆలిండియా కోటా మొదటి దశ కౌన్సెలింగ్ కొనసాగుతుంది. అందులో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ నాటికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 7, 8 తేదీల్లో ఎంసీసీ డేటా పరిశీలన చేయనుంది. అలాగే ఈనెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సీట్లు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 12లోగా ఆయా కాలేజీల్లో చేరాలి. రెండో దశ ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 12 నుంచి 20 వరకు, స్టేట్ కోటా కౌన్సెలింగ్ ఆగస్టు 19 నుంచి 29 వరకు ఉంటుంది.సెప్టెంబర్్ 3 నుంచి 10వ తేదీ వరకు మూడో దశ ఆలిండియా కోటా, 9 నుంచి 18 వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. స్ట్రే వేకెన్సీ కింద సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు ఆలిండియా కోటా సీట్లను, 25 నుంచి 29 వరకు స్టేట్ కోటా సీట్లను భర్తీ చేస్తారు. ఆలిండియా కోటాలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15 శాతం సీట్లు, ఎయిమ్స్, డీమ్డ్ యూనివర్సిటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను భర్తీ చేస్తారు.సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, పూర్తి వివరాలను ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది.