
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్‌వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే..
టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్‌లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే..
గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్‌కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో..
ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్‌ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.
A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.
She objected, sat down on the road in protest, and even broke into tears.
The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025
ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్‌తో నిద్రకు దూరం కావడం!. భారత్‌లో జెన్‌జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్‌జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్‌లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్‌లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట.
ఇప్పుడున్న జెడ్ జనరేషన్‌లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్‌లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్‌ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి.
ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్‌కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోంది
వీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్‌రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.
::వెబ్‌డెస్క్ ప్రత్యేకం