
మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, జూనియర్ ఇంటర్ చదువుతోంది. ఈ మధ్య ఎంతసేపు ఫోన్లోనే ఉంటోంది. చికాకుగా ఉండటం, అందరితో సరిగ్గా మాట్లాడక΄ోవడంతోపాటు తిండి కూడా బాగా తగ్గించేసింది. చదువు మీద బొత్తిగా ధ్యాస లేదు. ఈ మధ్య నేను అనుకోకుండా తన ఫోన్ చూస్తే ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా వేరే దేశంలోని వ్యక్తితో చాటింగ్, ఫోన్స్, వీడియో కాల్స్ మాట్లాడుతున్నట్లు గమనించాను. ఇంకా తన పర్సనల్ ఫొటోలు కూడా ఆ వ్యక్తికి పంపినట్లు చూసి నేను చాలా అప్‌సెట్ అయ్యాను. తన నుంచి ఫోన్ తీసుకుంటే చనిపోతానని చెదిరిస్తుంది. చాకుతో చేతిమీద కోసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఎవ్వరితోను చెప్పుకోలేని పరిస్థితి నాది! మా వారితో కూడా చెప్పే ధైర్యం లేదు. దిక్కు తోచని పరిస్థితిలో ఈ ఉత్తరం రాస్తున్నాను! దయచేసి సలహా చెప్పగలరు.
– ఒక సోదరి, హైదరాబాద్
ఇది మీరొక్కరే కాదు, ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ మధ్య కాలంలో టీనేజీ పిల్లలో ఫో, ఇంటర్నెట్ వాడటం చాలా ఎక్కువ అయింది. సోషల్ మీడియా ప్రభావం వారి మీద చాలా ఎక్కువగా ఉంది. మీ అమ్మాయి విషయానికి వస్తే ఫోన్ వాడకంతో పాటు, క్షణికావేశం, తప్పుడు నిర్ణయాలు, తొందరపాటుతనం, అంతర్గత భావోద్వేగాలను నియంత్రించలేకపోవడం కనిపిస్తోంది.
కౌన్సెలింగ్ ‘బిహేవియరల్ థెరపీ’ బాగా ఉపయోగ పడుతుంది. అయితే మీరు మీ భర్తతో కూడా దీని గురించి చర్చించడం మంచిది. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్’ ద్వారా మీరు కూడా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఆమెతో ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకోండి. తెలియని వ్యక్తులతో చాటింగ్ వలన వచ్చే నష్టాలను వివరించండి.
అదే విధంగా ఫోన్ సమయాన్ని ఎలా నిర్దేశించాలో చెప్పండి. తల్లిదండ్రులుగా మీరిద్దరూ కలిసి తనతో ప్రశాంతంగా మాట్లాడటం, వినడం మొదలు పెడితే, ఆమె కోర్కెలు, బాధలు బయటపడతాయి. మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండి మానసిక వైద్య నిపుణల సహాయంతో ఈ సమస్య నుంచి మీ అమ్మాయిని తప్పకుండా పూర్తిగా బయటికి తీసుకు రావచ్చు.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)