ప్రపంచ క్రెడిట్ మార్కెట్‌లో ‘హీట్’ | Global Credit Markets Hottest Levels Major Asset Managers Warning, Read Full Story Inside For More Details | Sakshi
Sakshi News home page

ప్రపంచ క్రెడిట్ మార్కెట్‌లో ‘హీట్’

Jan 19 2026 9:41 AM | Updated on Jan 19 2026 10:43 AM

Global credit markets hottest levels Major asset managers warning

ఆత్మసంతృప్తి ప్రమాదకరంగా మారవచ్చు

దిగ్గజాల హెచ్చరిక

ప్రపంచ క్రెడిట్ మార్కెట్లు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో కార్పొరేట్ బాండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇదే సమయంలో రిస్క్‌కు లభించే ప్రతిఫలం (ప్రీమియం) కనిష్ట స్థాయికి పడిపోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి క్రెడిట్‌ మార్కెట్లలో కనిపిస్తున్న ‘ఆత్మసంతృప్తి’ (Complacency) భవిష్యత్తులో ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.

రికార్డు స్థాయిలో తగ్గిన ప్రీమియం రాబడి

బ్లూమ్‌బెర్గ్ గణాంకాల ప్రకారం, కార్పొరేట్ రుణాలపై ప్రీమియం నుంచి లభించే మార్జిన్‌ కేవలం ఒక శాతానికి  పడిపోయింది. ఇది జూన్ 2007 తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి. ఆర్థిక స్థిరత్వంపై నమ్మకం, రేటింగ్‌లు, కరెన్సీలో మార్పులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని కొందరు చెబుతున్నారు. అదే సమయంలో క్రెడిట్‌ కంపెనీలకు తగిన పరిహారం లభించడం లేదన్నది విశ్లేషకుల వాదన. ప్రస్తుత పరిస్థితుల్లో అతిగా రిస్క్ ఉన్న విభాగాల్లో క్రెడిట్‌ జోలికి వెళ్లకపోవడమే సరైన వ్యూహమని అబెర్డీన్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ ల్యూక్ హిక్మోర్ పేర్కొన్నారు.

బార్‌క్లెస్‌ పీఎల్‌సీ (Barclays PLC) విశ్లేషణ ప్రకారం, యూఎస్ రుణ మార్కెట్లో రిస్క్ పట్ల అశ్రద్ధ లేదా క్రెడిట్‌ కంపెనీల్లో ఆత్మసంతృప్తి స్థాయి 93 శాతానికి చేరింది. ఇది డిసెంబర్ 2024 తర్వాత గరిష్ట స్థాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలకు రుణాలు పుట్టడం చాలా సులభమైంది. కొత్త కార్పొరేట్‌ బాండ్లపై చెల్లించాల్సిన అదనపు వ్యయం కేవలం 1.3 బేసిస్ పాయింట్లు మాత్రమే ఉంది. ఇది గత ఏడాది సగటు (3 బేసిస్ పాయింట్లు) కంటే చాలా తక్కువ. ఈ ఏడాది జారీ చేసిన బాండ్లకు విక్రయ పరిమాణం కంటే ఇన్వెస్టర్ల నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ఆర్డర్లు రావడం మార్కెట్ జోరుకు నిదర్శనం.

ముంచుకొస్తున్న సవాళ్లు

మార్కెట్లు ఇంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు పొంచి ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా, మిడిల​్‌ఈస్ట్‌ ప్రాంతాల్లో నెలకొన్న సంక్షోభాలు ఇంకా కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలు ప్రపంచ వాణిజ్యంపై చూపే ప్రభావాన్ని తేలికగా తీసుకోలేం. యూఎస్‌ ఫెడ్ ఛైర్మన్‌ జెరోమ్ పావెల్‌పై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలపై రాజకీయ ఒత్తిడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ చిన్న పొరపాటు జరిగితే క్రెడిట్‌ కంపెనీలు ఏమేరకు తట్టుకుంటాయనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి.

రికార్డు స్థాయిలో బాండ్ల జారీ

ఈ ఏడాది జనవరి తొలి పదిహేను రోజుల్లోనే కంపెనీలు సుమారు 435 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను జారీ చేశాయి. ఇది ఒక రికార్డు. గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ వంటి దిగ్గజాలు కూడా 16 బిలియన్ డాలర్ల రుణాన్ని సమీకరించాయి. పెట్టుబడిదారుల వద్ద నగదు లభ్యత ఎక్కువగా ఉండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే ఆశలు మార్కెట్‌ను నడిపిస్తున్నాయి. అయితే, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని దిగ్గజ సంస్థలు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: మీరు యాక్టివా.. పాసివా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement