‘‘నన్ను చంపేస్తే.. ఇరాన్‌ను భూస్థాపితం చేస్తాం’’ అంటూ ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హచ్చరించారు. 'న్యూస్ నేషన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుణ్ని ఏ దేశమైనా చంపితే, అమెరికా సైన్యం సైలెంటుగా ఎందుకు ఉంటుంది? కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందన్న ట్రంప్.. తనను ఇరాన్ చంపితే, ఆ తర్వాత భూమిపై ఇరాన్ అన్నదే లేకుండా చేస్తా.. మా వాళ్లకు ముందే ఆదేశాలిచ్చానంటూ వ్యాఖ్యానించారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 37 ఏండ్ల దుష్ట పాలనను అంతం చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌లో అశాంతి ఇలాగే కొనసాగితే దేశం మొత్తం పేలిపోతుందంటూ మరో వార్నింగ్ ఇచ్చారు. కాగా, నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇటీవల పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
.@POTUS on threats from Iran: "I've left notification, anything ever happens... the whole country's going to get blown up." pic.twitter.com/oD6WpeWVoY
— Rapid Response 47 (@RapidResponse47) January 21, 2026
మరోవైపు, ట్రంప్.. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు టారిఫ్‌లను ఆయుధంగా వాడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన మాట వినని కారణంగా టారిఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌పై ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఈ నేపథ్యంలో మాక్రాన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు వేస్తానని బెదిరించారు.


