
ఒకప్పుడు చిన్నారులకు చందమామ కథలు చెబుతూ అన్నం తినిపించేవారు అమ్మలు. ఆ కథలు వింటూ మరో లోకంలో విహరించేవి ఆ పసిహృదయాలు. చిన్న తలుపు తట్టినా చప్పట్లతో పరుగులుతీసి ఆటలాడేవారు. ఇప్పుడు ఆ రోజులు వెనక్కి పోయాయి. చందమామ చూపించే తల్లుల బదులు, యూట్యూబ్ కార్టూన్లు ప్లే చేసే అమ్మలుగా మార్పుచెందారు. బాల్యంలోనే మొబైల్‌తో స్నేహం చేస్తూ పెరుగుతున్న ఈ తరం అది లేకుండా ఉండలేని స్థితికి చేరింది. ఇది అధునాతన సాంకేతికత అందించిన సౌకర్యమే కాదు, అనేక మానసిక, శారీరక సమస్యలకు దారితీసే వ్యసనం కూడా. ప్రస్తుత తరుణంలో టెక్నాలజీని పూర్తిగా నిరాకరించడం సాధ్యమా అంటే.. కాదనే చెబున్నాయి అధ్యయనాలు.. అలా అని అంతలా అవసరమా అంటే అదీ కాదనే చెబుతున్నారు. కానీ చిన్నారుల మెదడు అభివృద్ధి, మానసిక స్థితి, నైపుణ్యాల పెరుగుదల అన్నిటికీ స్థిరమైన అనుసంధానం కావాలంటే, మొబైల్ వినియోగాన్ని సమతుల్యంగా నియంత్రించడం తల్లిదండ్రుల బాధ్యత. వారు చూపిన దారిలోనే పసి పిల్లలు నడుస్తారు.. మనం మొబైల్ ఆఫ్ చేస్తే, వారు జీవితాన్ని ఆనందించడంలో ముందుకు వస్తారన్నది నిపుణుల మాట.
ఇటీవలి కాలంలో పిల్లల్లో ఫోన్లు, ట్యాబ్‌ల వినియోగం భారీగా పెరిగిపోతోంది. నగరాల నుంచి పల్లెలకూ ఈ విష సంస్కృతి విస్తరించింది. సహజమైన ఆటలతో అలసిపోవాల్సిన పసి హృదయాలు డిజిటల్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. దీనికి ప్రధాన కారకులు తల్లిదండ్రులేనని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం తినిపించడానికో.. అల్లరి తగ్గించడానికో మనం అలవాటు చేసే ఈ పద్ధతికి బాల్యం బలైపోతోంది. కొంత కాలానికి అదే అడిక్షన్‌గా మారుతోంది. చిన్నారులకు మొబైల్ వినియోగం వల్ల కలిగే నష్టాలు సాధారణమైనవి కాదు, వారు పెరుగుతూ ఉంటే ఈ వ్యసనం పోతుందని నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావం చేత చిన్నారులు దీర్ఘకాలిక సమస్యల భారిన పడుతున్నారు.
దృష్టి సమస్యలు : నిరంతరం మొబైల్ స్క్రీన్ చూడటంవల్ల, మరీ దగ్గర నుంచి చూస్తుండటం వల్ల చూపు బలహీనపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మైల్స్ డిసార్డర్స్, డ్రై ఐ వంటి సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది.
నిద్రలేమి : స్మార్ట్‌ఫోన్ నుంచి వచ్చే నీలి కిరణాలు(బ్లూ లైట్) నిద్రకు ఉపకరించే మెలటోనిన్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. తద్వారా దీర్ఘకాలిక నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉంది.
మానసిక అసంతృప్తి : ఎక్కువగా డిజిటల్ ప్రపంచంతో మమేకమవుతూ, వాస్తవ ప్రపంచానికి దూరమవ్వడం వల్ల పిల్లల్లో ఒంటరితన భావన, ఆందోళన, కొంతవరకూ డిప్రెషన్‌కు గురికావచ్చు.
అవగాహనాలేమి : వీడియోలు, రీల్స్ వంటి తక్షణ వినోదం చిన్నారుల్లో సహనాన్ని తగ్గిస్తుంది. దృష్టి ఎటుపోతుందో అక్కడే ఆలోచన కూడా ఆగిపోతుంది. ఇది భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా మారవచ్చు.
చూడకూడనివన్నీ చూస్తూ : కొన్ని రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో పిల్లలకు అవసరం లేని కంటెంట్ ఉంటుంది. అది వారి ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే దుష్ఫలితాలను కలిగిస్తుంది.
పెద్దలే ఆదర్శంగా : తల్లిదండ్రులే ముందుగా మొబైల్‌కి బానిసలుగా ఉంటే.. పిల్లలు ఎలా దూరమవుతారు? ఫోన్‌ల వాడకాన్ని తల్లిదండ్రులే మొదట నియంత్రించాలి. తద్వారా పిల్లలకు ఆదర్శంగా మారాలి.
నియంత్రిత కంటెంట్ : పిల్లలకు పూర్తిగా మొబైల్ తీసేయడం కాకుండా, వారితో ఓపెన్ డైలాగ్ పెట్టి, వారికి సేఫ్ కంటెంట్ మాత్రమే చూపించడం అవసరం.
ఇతర వ్యాపకాల వైపు..
పిల్లలను మొబైల్‌కి దూరం చేయడానికి పరిష్కార మార్గాలు మనచేతుల్లోనే ఉంటాయి. వారి మానసిక స్థితికి అనుగుణంగా, వారి ఇష్టాలపై ఆసక్తి పెంచేలా ఇతర వ్యాపకాలతో మునిగిపోయేలా చేయొచ్చు.
సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పిల్లలు మొబైల్ చూడకుండా ఉండేందుకు కొన్ని విడియోలు, టిప్స్, ట్రిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ‘కిట్ బ్యాగ్ ట్రిక్’, ‘బుక్స్ బిఫోర్ స్క్రీన్’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
వాటిపై తల్లిదండ్రులు దృష్టిసారించాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లలకి యాక్టివిటీ జర్నల్స్ ఇవ్వడం, పజిల్ ఛాలెంజ్‌లు పెట్టడం ద్వారా మొబైల్ బదులుగా కొత్త అలవాట్లు పెంచుతున్నారు. ఈ డిజిటల్ తరం కాబట్టి అవసరమైనంత మేర రైమింగ్స్, కిడ్స్ ఐక్యూ వంటి వీడియోలు చూపించి వారి వ్యసనాన్ని నియంత్రించాలి.
డిజిటల్ డిటాక్స్ షెడ్యూల్ : రోజులో ఒక నిర్దిష్ట సమయానికి మొబైల్ పూర్తిగా వదిలేసి, కుటుంబంతో సమయాన్ని గడపడం, ఆటలు, పుస్తకాలు, చర్చలతో సమయాన్ని గడిపేలా
చేయాలి.
ఆఫ్‌లైన్ వినోదాన్ని ప్రోత్సహించాలి : బొమ్మల కథలు, బోర్డు గేమ్స్, డ్రాయింగ్, సంగీత తరగతులు, నృత్యం లాంటి క్రియేటివ్ యాక్టివిటీలతో వారి దృష్టిని డైవర్ట్ చేయాలి.
(చదవండి: ఆంబోప్లియా: లేజీ 'ఐ' ఓ కన్నేయండి..!)