
శారీలో కొత్త డ్రేపింగ్ స్టయిల్స్ ట్రై చేస్తుంటాను. ఇది శారీకి కొత్త జీవాన్ని ఇస్తుంది. సామాన్యమైన సల్వార్‌ను కూడా కొత్త శైలిలో ధరించడం ద్వారా ప్రత్యేకతను పొందవచ్చు. నేను ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. అందుకే, నా చర్మం, జుట్టు సహజంగానే మెరుగ్గా ఉంటాయి. నిజానికి, నా అందం మొత్తం నా సహజత్వంలోనే ఉంది అని చెబుతోంది అనుమోల్
అందానికి వయసుతో నిమిత్తం ఉండదనేందుకు నిదర్శనం ఆమె. అందమైన వర్చస్సుతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నటి అనుమోల్ ఫాలో అయ్యే స్టయిలింగ్ టిప్స్ నేటి యువతను కూడా ఆకర్షించి, ఫాలో అయ్యేలా చేస్తున్నాయి.
ఇక్కడ అనుమోల్ ధరించిన చీరబ్రాండ్: చినాయా బెనారస్, ధర: రూ. 16,658, జ్యూలరీ బ్రాండ్: దీపాలీ డిజైన్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
స్టిచ్డ్ జ్యూలరీ
ఆభరణాలు లేకుండా రాయల్టీ లుక్ సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటున్నారా? కాని, మీ దగ్గర ఒకే ఒక్క స్టిచ్డ్ జ్యూలరీ బ్లౌజ్ ఉంటే, అసాధ్యాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేయగలరు. మెడ చుట్టూ నెక్లెస్‌లా మెరుస్తూ, చేతులపై వంకీల్లా మెరిసిపోతూ, వెనుకవైపు పెండెంట్‌లా గ్లామర్ జోడించే ఈ మగ్గం వర్క్ డిజైన్లు, ‘ఎక్కడ హారం? ఎక్కడ గొలుసు?’ అని వెతికే పని, ఇతర అదనపు జ్యూలరీ అవసరం లేకుండా చేస్తాయి.
ఎందుకంటే ఆభరణాలే బ్లౌజ్‌లో దాక్కుని ఉంటాయి. ఒక్క బ్లౌజ్‌తోనే మీ స్టయిల్ నేరుగా స్టార్‌డమ్ లెవెల్‌కి చేరుతుంది. సింపుల్ కలర్ చీరతో కలిపితే మగ్గం వర్క్ మరింత హైలైట్ అవుతుంది, హెయిర్ స్టయిల్ బన్ లేదా సైడ్ ప్లేట్స్ సరిగ్గా సరిపోతుంది. వీటితోపాటు, మినిమల్ మేకప్ అదనంగా అందాన్ని జోడిస్తుంది. అయితే, బ్లౌజ్ ఫిటింగ్ సరిగ్గా ఉంటే, మగ్గం వర్క్ డిజైన్ మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది.
దీపిక కొండి
(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్‌లు ఇవే..!)