breaking news
Ganesh nimajjana celebration
-
గణేశ నిమజ్జనం ఆంతర్యం..!
అనంత చతుర్దశికి ఒక విశేషం వుంది. ఆ రోజు నాడే శ్రీ వినాయకుడిని నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. ఆయనను ప్రతిష్టించి పది రోజులు పూజలు జరుపుకున్న తరువాత మట్టితో చేసిన ఆయన ప్రతిమను నదిలో గానీ, సముద్రంలో గానీ కలపడానికి కారణం అలా పూజలందుకున్న వినాయకునికున్న శక్తులు ఆ నీటి ప్రవాహం ద్వారా సర్వత్రా వ్యాప్తి చెందుతాయని, ఆ విధంగా శ్రీ గణేశుని శక్తులు, తత్వమయిన పవిత్రత, వివేకం, అబోధితత్వం, విచక్షణ, తల్లిపట్ల సమర్పణా భావం ఆ అనంతమైన నీటిలో స్థిరపడి ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుకుంటాయి. అనంత అంటేనే శ్రీ వినాయకుడు. అనంత అంటే నాశనం లేనివాడు. అనంతగా వ్యాపించి వున్న గణేశశక్తి.అంతటి మహత్తు, మహిమాన్వితుడిని నిమజ్జనానికి తీసుకెళుతున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్దలతో, మేళ తాళాలతో, మంగళ ప్రదమైన గణేశ్ కీర్తనలతో సాగనంపాలి. ఆయన జన్మించిన భాద్రపద శుక్ల చవితి నాడు ఆయనను ప్రతిష్టించి, ఆ తరువాత పదవ రోజున, అంటే అనంత చతుర్దశి నాడు సముద్రంలో నిమజ్జనం చేయడానికున్న ప్రాముఖ్యత అటువంటిది.మట్టినుంచి ఉద్భవించిన గణేశుడు నీటిలోకి చేరి తద్వారా మానవాళికి, జంతువులకు, ప్రకృతికి తన శక్తులను, తత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత నిమజ్జనం కార్యక్రమాన్ని గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పుణ్యకార్యంగా జరుపుకోవాలి తప్పించి అశ్లీలతకు, నిందారోపణలకు, ఘర్షణలకు దారితీసే వాతావరణంలో కాదు. – డా. పి.రాకేశ్(పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ప్రవచనాలు ఆధారంగా) -
సాంఘీక నృత్యం కోలాటం..
కోల అంటే కర్రపుల్ల.. ఆట అంటే నృత్యం.. ఈ రెంటినీ కిలిపేదే కోలాటం.. పల్లె, పట్టణంలో చిన్నా పెద్దా భేదం లేకుండా పండుగవేళ సరదాగా ఆడే సాంఘిక నృత్యమే కోలాటం. ఈ నృత్య సంప్రదాయం నేడు ఆధునిక పద్ధతులతో మరింత అబ్బురపరుస్తుంది. నవరాత్రుల్లో అందరినీ ఆకట్టుకునే నృత్యంగా గుర్తింపు తెచ్చుకుంది. మహిళలంతా ఒకే రంగు దుస్తుల్లో గుండ్రంగా తిరుగుతూ కోలాటం ఆడుతుంటే ఆ జోష్ మాటల్లో చెప్పలేం..నగరంలో గణనాథుని ఉత్సవాల నేపథ్యంలో ఇప్పటికే కోలాటాల సందడి షురూ అయ్యింది. సందర్భాన్నిబట్టి బాణీలు కట్టే ఈ సంప్రదాయ కళ.. నేడు ఆధ్యాత్మికతకు సంస్కృతిని జోడించి మరింత ఆకర్షణీయంగా అలరిస్తుంది. డ్రెస్ కోడ్‌తో మరింత శోభ..కోర్ సిటీ, శివారు ప్రాంతం అని తేడా లేకుండా కోలలు మార్మోగుతున్నాయి. గణేశుని శోభాయాత్రలో ముందువరుసలో మహిళలు కోలాటం ఆడుతూ ఊరేగింపుకు ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇందుకోసం మహిళలందరూ డ్రెస్‌కోడ్ పాటిస్తున్నారు. అప్పుడే ఆ కళకు మరింత వన్నె తీసుకురావచ్చని భావిస్తున్నారు. దీని కోసం ఆయా గ్రూపుల వారు తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ఆకర్షణీయమైన వ్రస్తాలను ఎంచుకుంటున్నారు. వనితలు తాండవం ఆడుతూ తమ చేతుల్లోని రెండు కర్రలు కలుపుతూ చేసే ధ్వనులు వీక్షకులకు వీనుల విందు మాత్రమే కాదు.. ఆ కళారూపం నయనానందకరం. గణేశ నవరాత్రులు వచ్చాయంటే గల్లీగల్లీలోనూ సందడే.. మండపం తీర్చిదిద్దే దగ్గర నుంచి నిమజ్జన ఊరేగింపు వరకూ ఎందులోనూ రాజీపడకుండా ఉత్సవ నిర్వాహకుల మధ్య ఆధ్యాతి్మక పోటీ నెలకొనడం సహజమే. పాడ్బ్యాండ్, తీన్మార్ స్టెప్పులు, కళాకారుల వేషధారణలతో గణపయ్యను సాగనంపుతారు. అయితే గత కొన్నేళ్లుగా సంప్రదాయ కోలాట సందడి నగరంలో జోరుగా కనిపిస్తోంది. దీనికి ఆధ్యాతి్మకతను మిళితం చేసి మానసికోల్లాసాన్ని అందించే కోలాటం కళలో శిక్షణకు ఎంతైనా ఖర్చు చేసేందుకు మహిళలు వెనుకాడడం లేదు. కాలనీల్లో బృందాలుగా.. గతంలో ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు వచ్చి నృత్యాలు చేసేవారు. కానీ ఇటీవల కాలంలో నగరంలోని గేటెడ్ కమ్యూనిటీల్లో, కాలనీల్లో అక్కడి మహిళలే బృందాలుగా ఏర్పడి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ పొందుతున్నారు. తమ వినాయకుడి వద్ద తామే కోలాటం ప్రదర్శించేందుకు చిన్నారులు, మహిళలు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇందుకోసం నేర్పే గురువుల టైమ్‌స్లాట్స్ దొరకడంలేదంటే అతిశయోక్తి కాదు. నిజాంపేట ప్రాంతానికి చెందిన ఓ గురువు ఉదయం 5.30 గంటలకు కోలాట శిక్షణ తరగతులు ప్రారంభిస్తే అర్ధరాత్రి 12 గంటల వరకు 12 మండపాల వరకూ మహిళలకు శిక్షణ ఇస్తూనే ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. టైమ్ స్లాట్స్ కుదరక కొన్నిచోట్లకు అసిస్టెంట్స్‌ను పంపిస్తున్నారు. నిమజ్జన శోభాయాత్ర కోసం వేల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు. పలువురికి హాబీగా.. కేవలం ఉత్సవ వేళ మాత్రమే నేర్చుకుని వదిలేయడం కాకుండా.. దీనిని ఓ హాబీగా మార్చుకుని కోలాటం వేస్తున్నారు. తద్వారా కాలనీలో జరిగే దసరా, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఉగాది, న్యూయర్.. ఇలా ప్రతి ఈవెంట్లో కోలాటానికి షెడ్యూల్ ఉండాల్సిందే. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు కోలాట సంస్కృతికి ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. దీనికి తోడు కోలాటంలో ఆధ్యాత్మికత, మానసిక దృఢత్వం, ఫిట్నెస్ అంశాలు మిళితమై ఉన్నాయి. దీంతో మహిళల చేతుల్లోని కర్రలను లయబద్దంగా ఆడించడానికి ఎంతో ఏకాగ్రత అవసరం. తద్వారా చిన్నారులకు ఏకాగ్రత కూడా పెరుగుతుందని పలువురు భావిస్తుండడం విశేషం. అంతేకాకుండా పొరుగువారితో స్నేహం కూడా పెంపొందుతుందని వీరు నమ్ముతున్నారు. కోలాటం నేర్చుకోవాలనే తాపత్రయం పెరిగిందినేను సిటీకి వచ్చి ఏడేళ్లు. అప్పటి నుంచి కోలాటం నేర్పుతున్నాను. అప్పట్లో ఆదరణ అంతంతమాత్రంగా ఉండేది. రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా అడపా దడపా వినాయక మండపాల వద్ద నేర్చుకునేందుకు ముందుకువచ్చేవారు. కానీ ఇప్పుడు కోలాటం నేర్చుకోవాలనే తాపత్రయం పెరిగింది. ఇప్పుడు తాను ఉదయం 5.30 గంటలకు శిక్షణ మొదలుపెడితే అర్ధరాత్రి 12 గంటల వరకు నేర్పుతున్నాను. నాకు సమయం లేక మరికొంతమంది వద్దకు నా అసిస్టెంట్‌ను పంపిస్తూ నేర్పిస్తున్నాను. ఫిట్నెస్ కూడా కోలాటం ఎంతగానో దోహదం చేస్తుంది. – సాయిగణేశ్ కోలాటం మాస్టర్ఐక్యత పెరిగేందుకు.. మాది కొత్తగా ఏర్పడిన గేటెడ్ కమ్యూనిటీ. సభ్యుల మధ్య పరిచయాలు, ఐక్యత పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. కొందరు ప్రత్యేకంగా గ్రూప్ క్రియేట్ చేసుకుని కోలాటం నేర్చుకుంటున్నారు. మా ప్రయత్నం ఫలించింది. దీనిని కమ్యూనిటీలోని ప్రతి కార్యక్రమంలో ప్రదర్శిస్తున్నాం. – రావూరి శ్రీవాణి, గోథిక్ పెంటగాన్ క్లౌడ్స్ (గేటెడ్ కమ్యూనిటీ) ఫిట్‌నెస్‌పరంగానూ ఉపయోగం.. కోలాటం కేవలం ఒక వినోదాత్మక కళ మాత్రమే కాదు.. శారీరక, మానసిక దృఢత్వానికి కీలకం. 1300 ఫ్లాట్లు కలిగిన మా కమ్యూనిటీలో శ్రీరామనవమి, కృష్ణాష్టమి, గణపతి నవరాత్రులు ఇలా ఏ పండుగ వచ్చినా కోలాట ప్రదర్శన తప్పనిసరి. మాస్టర్స్ వద్ద మా సభ్యులు మెళకువలు నేర్చుకుంటున్నారు. మహిళల మధ్య బంధం బలపడుతోంది. – దీప్తి, బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్ అపార్ట్మెంట్ చిన్నారుల ఉత్సాహం..కాలనీలో ఎప్పటి నుంచో చిన్నారులు ఉత్సాహంగా కోలాటం నేర్చుకుంటున్నారు. గణపతి నిమజ్జన ఊరేగింపులో అందరూ ఒకేరకమైన డ్రెస్ ధరించడం శోభాయాత్రకే ప్రత్యేక ఆకర్షణ. కోలాటం శిక్షణను ఇక మీదట కూడా కొనసాగిస్తాం. దీని ద్వారా పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. – బుచ్చిబాబు, మోడల్‌కాలనీ ప్రధాన కార్యదర్శి (చదవండి: ల్యాబ్ మేడ్ ఫిష్) -
రాష్ట్రానికి కేంద్ర బలగాలు
ఒకే సమయంలో అసెంబ్లీ సమావేశాలు, బక్రీద్, గణేశ్ నిమజ్జనం సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు, బక్రీద్, గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బక్రీద్ పండుగ, 27న గణేశ్ నిమజ్జనం ఉండటంతో పోలీసులు రాజధాని నగరాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం నగర కమిషనరేట్పరిధిలో 12 వేల మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వీరికి తోడు జిల్లాల నుంచి 7వేల మందిని రప్పించారు. అదేవిధంగా రాష్ట్ర విజ్ఞప్తి మేరకు కేంద్రం నుంచి వెయ్యి మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 500 మంది పోలీసులు వచ్చారు. అలాగే రాష్ట్రంలోని 62 వేల మంది పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. హైదరాబాద్‌పై పటిష్ట నిఘా నగరంలో మూడు ప్రధాన ఘటనలు ఒకేసారి ఉండటంతో రాత్రి పగలు తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటుచేసుకున్నా ఉన్నతాధికారులకు చేరేలా స్పెషల్‌బ్రాంచ్ (ఎస్బీ), ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేశారు. భారీగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. సీసీ కెమెరాలన్నింటినీ అత్యాధునిక కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించి, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసేలా పటిష్ట చర్యలు చేపట్టారు. వీటికి తోడు వెహికిల్ మౌంట్ కెమెరాల ద్వారా ప్రతీక్షణం రికార్డు చేయనున్నారు. ఈ వాహనాల ద్వారా 360 డిగ్రీల కోణంలో 500 మీటర్ల వరకు దృశ్యాలను బంధించనున్నారు. 30 బాంబు డిస్పోజల్స్, 30 డాగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలకు హెచ్చరికలు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఇద్దరు మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో వారి కదలికలు ముమ్మరమయ్యాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాల నుంచి 40 శాతం పోలీసు సిబ్బంది హైదరాబాద్ రావడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మావోయిస్టు ప్రాబల్యం కలిగిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మావోయిస్టు కదలికలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.