
బీజింగ్: కైక్వీ.. కమ్యూనిస్ట్ చైనాలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కుడిభుజంగా పేరొందిన కైక్వీ అంటే అపరచాణిక్యుడనే పేరు. అటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీపీ)లో అగ్రగణ్యునిగా కొనసాగుతూనే ఇటు ప్రభుత్వంలోనూ కీలక పదవుల్లో అవలీలగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిన్‌పింగ్‌కు తల్లో నాలుకలా వ్యవహరిస్తూ జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తారు. ఆయన నవ్వడం ఎవరూ చూడలేదని చైనా రాజకీయవర్గాల్లో ఓ మాట వినిపిస్తుంది.
విదేశాల నుంచి జిన్‌పింగ్‌ను కలిసేందుకు ఎందరో దౌత్యాధికారులు వచ్చినా తర్వాత కైక్వీని కలిసి ప్రసన్నంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆయన ఎవరినీ కలవరు. ఇటీవల షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర భేటీ కోసం తియాంజిన్ తీరనగరానికి విచ్చేసిన ఎస్‌సీఓ అగ్రనేతలు, దౌత్యవేత్తలు తనను కలవాలని చూసినా కైక్వీ ససేమిరా అన్నారట. అలాంటి కైక్వీ ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీతో 45 నిమిషాలకుపైగా విడిగా మాట్లాడిన వార్త ఇప్పుడు చైనా వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.
చైనాలో జిన్‌పింగ్ శకం ముగిసి కైక్వీ భావ చైనా అధ్యక్షుడు కావొచ్చనే వాదన సైతం మొదలైంది. అందుకే కైక్వీతో మోదీ భేటీని జిన్‌పింగ్ స్వయంగా ఏర్పాటుచేశారని తెలుస్తోంది. గల్వాన్ ఘటన తర్వాత దెబ్బతిన్న భారత్, చైనా బంధాన్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడమే లక్ష్యంగా కైక్వీని కలవాలని మోదీకి జిన్‌పింగ్ సూచించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరుదేశాల మధ్య బంధాన్ని పటిష్టపర్చి మరింత మెరుగైన ఆర్థిక, దౌత్య సంబంధాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు వార్తలొచ్చాయి.
ఎవరీ కైక్వీ?
చైనా కమ్యూనిస్ట్ పారీ్టలో అత్యున్నత నిర్ణాయక మండలిలో ఈయన సీనియర్‌సభ్యునిగా ఉన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఐదో అత్యున్నత నేతగా కొనసాగుతున్నారు. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. జిన్‌పింగ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గానూ కైక్వీ మరో పదవిలో కొనసాగుతున్నారు. మావో తర్వాత చైనాలో ఇలా రెండు, మూడు పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్న వ్యక్తి ఈయనే కావడం విశేషం. చైనాలోని అధికార క్రమంలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ జిన్‌పింగ్‌తో ఉన్న అత్యంత దగ్గరి రాజకీయ సాన్నిహిత్యం కారణంగా తదుపరి దేశాధ్యక్షుడు ఇతననే వాదన సైతం బలంగా వినిపిస్తోంది.
ఫుజియాన్ ప్రావిన్స్‌లోని యూక్సీ కౌంటీలో జన్మించిన ఈయ తొలిసారిగా 1980వ దశకంలో జిన్‌పింగ్‌ను కలిశారు. 1975లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. సాన్మింగ్, ఖ్వుజోయూ, హాంగ్‌జోయూ నగరాలకు మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2016లో బీజింగ్ నగరానికి తాత్కాలిక మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వంలో, పార్టీలో ఏ స్థాయి ర్యాంక్‌లో కొనసాగుతున్నాసరే కైక్వీ మాట చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. పార్టీ జనరల్ ఆఫీస్‌కి డైరెక్టర్‌గానూ ఉన్నారు. జిన్‌పింగ్‌ను అందరి ఎదుట కైక్వీ ‘అంకుల్’, ‘బాస్’అని పిలుస్తారు.